* సమగ్ర సర్వే చాలా ప్రతిష్టాత్మకం
* ఎన్యూమరేటర్లతో నిత్యం మాట్లాడండి..
* ఇంటింటి సర్వే నేపథ్యంలో ఉన్నతాధికారులతో భట్టి వీడియో కాన్ఫరెన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : యావత్ దేశం తెలంగాణను గమనిస్తున్నదని, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను విజయవంతం చేద్దామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy Cm Mallu Bhatti Vikramarka) అన్నారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్(Video Conferance) నిర్వహించారు. ఇళ్ల గుర్తింపును విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందించారు. నేటి నుంచి ప్రశ్నావళి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా అనేక ప్రశ్నలు ఎదురవుతాయనీ అన్నింటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్యూమరేట్లతో ఉన్నతాధికారులు, కలెక్టర్లు(Collectors) మాట్లాడుతూ తగిన గైడైన్స్ ఇవ్వాలని వెల్లడించారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. ఇది దేశంలోనే అతిపెద్ద కార్యక్రమమని, ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి(CS Shanthikumari), ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
…………………………………………..