*ఉత్కంఠకు తెర
* సిటింగ్ స్థానం కోల్పోయిన బీఆర్ఎస్
ఆకేరు న్యూస్, నల్గొండ : నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ( graduates MLC ) స్థానానికి మే 27న పోలింగ్ జరిగింది. బుధవారం ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలింది. పోలైన 3,36,013 ఓట్లలో 25,824 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేటప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (Theenmar Mallanna) కు 1,22,813 ఓట్లు దక్కగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,318, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి.
అర్థరాత్రి ప్రకటన
మొదటి ప్రాధాన్యంలో ఫలితం తేలలేదు. ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. శుక్రవారం రాత్రి వరకు మూడో స్థానంలో ఉన్న ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. ప్రేమేందర్‌రెడ్డి సహా 50 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపు 18 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ద్వితీయ స్థానంలో ఉన్నారు. మల్లన్నకు కోటా ఓటు రాకపోవడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం మల్లన్నను విజేతగా ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ని కోరుతూ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ పంపారు. సీఈవో అనుమతితో శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్సీగా మల్లన్న గెలుపొందినట్లు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ ఉపఎన్నిక జరిగిన విషయం విదితమే. ఈ ఎన్నికలో పరాజయంతో బీఆర్ ఎస్ సిటింగ్ స్థానాన్ని కోల్పోయింది.
———————