* అలుపెరుగని అక్షర యోధుడు
* మీడియా ప్రపంచంలో తన దైన ప్రత్యేక స్థానం
* ప్రంపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. కొంతకాలంగా అనాఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేవారు. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనను కుటుంబ సభ్యులు చేర్పించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన.. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని ఫిలింసిటీ కి తరలించారు. రామోజీరావు పత్రికా రంగంలో ఓ మహావృక్షం. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకులు. ప్రధాన సంపాదకులు. ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద 2000 వేల ఎకరాల సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
* రైతు కుటుంబ నేపథ్యం
రామోజీ రావు 1936 నవంబర్ 16 న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. రైతు సమస్యల పట్ల ఆర్థ్రత ఉన్న రామోజీ రావు రైతుల కోసమే ఒక పత్రిక ప్రారంభించాలనుకున్నాడు. కాల క్రమంలో 1974 ఆగష్టు 10 న ఈనాడు పత్రికను విశాఖ పట్నంలో ప్రారంభించారు. బహుముఖ ప్రజ్ఞ, నిరంతర సాధన ఆయన లక్షణాలు. ఈనాడు పత్రిక దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికలో ఒకటిగా నిలిపారు, ఈటీవి ని స్థాపించి ఇతర భారత భాషల్లోనూ విస్తరించారు.
————————————————————