
నేర సమీక్షా సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే.
* పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి.
* పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలి.
* చోరీలకు పాల్పడిన వారిని గుర్తించి సొత్తును రాబట్టాలి.
* ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేపట్టాలి.
* బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి వినియోగదారులపై కఠిన చర్యలు.
– నేర సమీక్షా సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే.
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : సామాన్యులకు భరోసా కలిగించే విధంగా పోలీసుల పనివిదానం ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కిరణ్ ఖరే హెచ్చరించారు. జిల్లా పోలీసు అధికారులు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవరించాలని, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసుల్లో లోతైన విచారణ తో కేసుల దర్యాప్తును పూర్తి చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణను త్వరగా పూర్తిచేసి చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతీ కేసుకు సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, లక్ష్యం నిర్దేశించుకుని విధులు నిర్వహించాలన్నారు. చోరీ కేసుల్లో అన్ని కోణాల్లో విచారణ చేసి చోరీలకు పాల్పడిన వారిని గుర్తించి సొత్తును రాబట్టాలన్నారు. ప్రతీ రోజు వాహనాల తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని, జిల్లా పరిధిలో గంజాయి రవాణా చేసే వారితో పాటు వినియోగదారులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, చెడు పనులను ఎవరూ ప్రోత్సహించిన ఉపేక్షించేదిలేదని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం, సైబర్ క్రైమ్ డీఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, సుభాష్ బాబు, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
——————–