
* పోలీసులకు గ్రామస్థుల ఫిర్యాదు
* దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆకేరు న్యూస్, వనపర్తి: భార్యాభర్త ల తగాదా.. తెల్లారేసరికల్లా భార్య హత్య .. కనిపించకుండా పోయిన భర్త.. భర్తనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని గ్రామస్థుల అనుమానాలు.. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం పొలికేపహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పొలికేపహాడ్ గ్రామానికి చెందిన మహిముదా, చోటేమియా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. వీరందరికీ వివాహాలు జరిగాయి. కుమారులు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. కూతురు అత్తవారింట్లో ఉంటోంది. భార్యాభర్తలు ఇంటి వద్దనే ఉంటున్నారు. శనివారం కల్లు దుకాణం వద్ద చోటు మియా గొడవ పడ్డాడు. ఈ కారణంతో పాటు మరికొన్ని కారణాల వల్ల భార్యాభర్తల
మధ్య గొడవ జరిగింది. తెల్లారేసరికల్లా మహిముదా (52) విగత జీవిగా కనిపించింది. ఆమె గొంతును ఎవరో కోసి హతమార్చారు. భర్త చోటేమియా కనిపించకుండా పోయాడు. దీంతో గ్రామంలో చోటేమియాపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ కృష్ణ, ఎస్ ఐ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
………………………………