* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇదే నినాదం
* 10 ఏళ్లలో వికాసం.. 2 ఏళ్లలో వినాశనం అంటున్న బీఆర్ఎస్
* 10 ఏళ్లలో వాళ్లు చేయనిది 2 ఏళ్లలో చేశామంటున్న కాంగ్రెస్
* ప్రజలు ఎవరికి ఓటేస్తారు
* ఆసక్తికరంగా ఉప ఎన్నిక
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
హైదరాబాద్ జిల్లాలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు అంతిమ ఘట్టానికి చేరుకుంది. రేపటితో ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. విమర్శల తాకిడిని కూడా పెంచాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, నిందించడం పెరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు మీట్ ద ప్రెస్‌లో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ అన్నారు. పారిశ్రామికవేత్తలనే కాదు.. ప్రజలను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ రియల్టర్లను భయపెడుతుంటే, ముఖ్యమంత్రి సెటిల్మెంట్లు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 10 ఏళ్ల వికాసానికి ఓటేస్తారో, 2 ఏళ్లలో జరిగిన వినాసనానికి ఓటేస్తారో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
వాళ్లేం చేయలేదు మేమే..
మరో వైపు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ ఎస్‌కు ఆరోపణలు చేయడం అలవాటు అయిపోయిందని, ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. అలాగే ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ వాళ్లు 10 ఏళ్లలో చేయని పనులను తాము 2 ఏళ్లలో చేసి చూపించామని ప్రచారం చేస్తున్నారు. అబద్దాలు చెప్పడంలో బీజేపీ, బీఆర్ ఎస్ పోటీపడుతున్నాయని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, బీఆర్ఎస్ అబద్ధాలకు మధ్య జరుగుతున్న యుద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మితే ప్రజలు గోసపడతారని, కాంగ్రెస్ చేస్తున్న మంచిని చూడాలని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేస్తున్నారు.
ఎవరు నెగ్గేనో?
కాంగ్రెస్ నుంచి మంత్రులు సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సహా వర్కింగ్ పెసిడెంట్ కేటీఆర్.. హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఒక పార్టీ నేతలను మరొకరు ఘోరంగా విమర్శించుకుంటున్నారు. ఈక్రమంలో ప్రజలు ఎవరికి ఓటేస్తారు అనేది ఆసక్తిగా మారింది. రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా ఒక్క స్థానం కూడా గెలవలేదు. దీంతో రాష్ట్ర క్యాబినెట్లో హైదరాబాద్ నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో ఏడాది క్రితం వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌పై గట్టి నమ్మకం పెట్టుకుంది. నమ్మకం ఒమ్ము అవుతుందా, నిలబడుతుందా అనేది వేచి చూడాలి.
