* 1999కు ముందు దారుణమైన పరిస్థితులు
* తలచుకుంటే ఇప్పటికీ దుఃఖం వస్తది
* 1969 ఉద్యమం కూలిపోయాక తెలంగాణ లేవలే
* ఎప్పటికైనా కేసీఆర్ లాంటోడు రాబోతాడా అని..
* ఎదురుచూసేవాళ్లమని జయశంకర్ నాతో అన్నారు
* 15 ఏండ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది
* మొట్టమొదటి లాఠీచార్జి వరంగల్‌లోనే..
* గొప్ప ఉద్విగ్నమైన క్షణం ఈరోజు
* తెలంగాణభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గొప్ప ఉద్విగ్నమైన క్షణం ఈరోజు అని, 1999కు ముందు నాటి పరిస్థితులు తలచుకుంటే ఇప్పటికీ దుఃఖమైతాదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్.. తెలంగాణ భవన్లో అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుస కరువులకు, వలసలకు, కరెంట్ కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు భయంకరమైన దృశ్యంగా నాడు తెలంగాణ ఉండేదని, అమానుష పరిస్థితులు కనిపించేవని తెలిపారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన 25-30 మంది శాసనసభ్యులతో కనీసం 30 సార్లు సమావేశాలు పెట్టినం. ఏం చేద్దాం. మన తెలంగాణ పరిస్థితి ఇంతేనా..? మనకు నిష్కృతి లేదా అని చర్చించినం. పది మంది కూసున్న దగ్గర కూడా తెలంగాణ అనే పదం వాడితే ఎగతాళి చేసిన పరిస్థితి’ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ అనకూడదని, వెనుకబడిన ప్రాంతం అనాలని శాసనసభాపతి నుంచి ఉత్తర్వులు జారీ చేసిన రోజులు ఉండేవని గుర్తు చేశారు.
ఆజన్మ తెలంగాణ వాది ప్రొఫెసర్ జయశంకర్
తెలంగాణ వస్తుందని ఎవరూ కల కనలేదని, 15 ఏండ్ల పోరాటం తర్వాత రాష్ట్రం ఆవిర్భవించిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా సహచరుడిగా, అడ్వైజర్ గా తన వెన్నంటే ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ ను గుర్తు చేసుకోకుండానే ఉండలేమన్నారు. ఆయన అన్ని పరిస్థితుల్లోను తన వెన్నంటే ఉన్నారన్నారు. ఆజన్మ తెలంగాణ వాది ప్రొఫెర్ జయశంకర్ అని చెప్పారు. ఆయన సుదీర్ఘకాలం కలిసి పని చేశారు. అయ్యదేవర కాలేశ్వరరావు వంటి వ్యక్తులు వచ్చి రాష్ట్రం రాదని తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేసేవారని, మీ తెలంగాణ భాష చెడిపోయిందని, మీది స్వచ్ఛమైన తెలుగుకాదని హేలన చేసినట్లు మాట్లాడుతూ మిమ్మల్ని సంస్కరించడానికి వచ్చామని చెబితే.. ఆయన ముందే పైకి లేచి.. పిడికిలి బిగించి జై తెలంగాణ అని ప్రజలు నినదించారని, ఆయనపై రాళ్లు వేశారని, ఆ సందర్భంగా వరంగల్‌లో మొట్టమొదటి లాఠీచార్జీ జరిగిందని ఉద్యమ రోజులను గుర్తు చేశారు.
1969 తర్వాత లేవని తెలంగాణ
1969లో కూడా ఉవ్వెత్తిన ఉద్యమం జరిగిందని, అనేక మంది పెద్దవాళ్లు పోరాడారని కేసీఆర్ తెలిపారు. పోచారం లాంటి వాళ్లు అనేక సార్లు జైలుకెళ్లారని గుర్తు చేశారు. నాటి ఉద్యమంలో ప్రధానమైనది ముల్కి ఉద్యమం అని చెప్పారు. ముల్కి రూల్స్ కు వ్యతిరేకంగా చచ్చిపోతామని తెలిసినా చాలా మంది తూటాలకు ఎదురెళ్లారని వివరించారు. అదే సమయంలో జై ఆంధ్రా ఉద్యమం కూడా తీవ్రస్థాయిలో మొదలైందని, దీంతో సుప్రీంకోర్టు తీర్పును కాలరాసి రాజ్యాంగ సవరణ చేసినా ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. 1969లో ఉద్యమం కూలిపోయిన తర్వాత తెలంగాణ మళ్లీ లేవలేదన్నారు. అయినప్పటికీ ఏనాటికైనా కేసీఆర్ లాంటోడు రాబోడా అని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నామని జయశంకర్ నాతో అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు.
బతుకమ్మ సినిమా తీద్దామనుకున్నా..
బతుకమ్మ పేరుతో సినిమా నేను తీద్దామనుకున్నానని, కథ కూడా రాసుకున్నా అని చెప్పారు. వాడెవడో తీశాడు.. అందులో ఏమీ లేదు.. అని విమర్శించారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన 25-30 మంది శాసనసభ్యులతో కనీసం 30 సార్లు సమావేశాలు పెట్టినం. ఏం చేద్దాం. మన తెలంగాణ పరిస్థితి ఇంతేనా..? మనకు నిష్కృతి లేదా అని చర్చించినం. ఆ రోజుల్లో కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకోవడం, వాళ్ల ప్రయోజనం నెరవేరిన తర్వాత పక్కకు పోవడం చేసిండ్రు. దాంతో ఇతర ప్రాంతాల వాళ్లేగాక తెలంగాణ వాళ్లే తెలంగాణను అవమానించే పరిస్థితి వచ్చింది. పది మంది కూసున్న దగ్గర కూడా తెలంగాణ అనే పదం వాడితే ఎగతాళి చేసిన పరిస్థితి’ అని కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ మహా వృక్షం
25 ఏళ్ల పార్టీ బీఆర్ ఎస్ ను ఖతం చేద్దామని చూస్తున్నారని, ఇది ఒక మహా వృక్షమని కేసీఆర్ తెలిపారు. గత ఎన్నికల్లో కేవలం 1.61 శాతం ఓట్లతో ఓడిపోయామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామని, ఎదురుదెబ్బ తాత్కాలికమే అని చెప్పారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్నారు. నూతన ఉద్యమ పంథాను అనుసరించాల్సిన సమయం వచ్చిందని గులాబీ శ్రేణులకు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ పెద్ద గాంబ్లింగ్ అయిపోయిందన్నారు. ఒకడు 11 వస్తాయన్నాడు.. ఇంకొకడు 2 అంటున్నాడు.. మరొకడు 4 అంటున్నాడని ఎద్దేవా చేశారు. 11 వచ్చినా ఉప్పొంగిపోమని, 3 వచ్చినా కుంగిపోయేది లేదని స్పష్టం చేశారు.
—————