Kalyana Lakshmi Pending Applications
* వేలల్లో దరఖాస్తులు పెండింగ్..
* ఇబ్బందుల్లో కొత్త జంటలు
Kalyana Lakshmi| ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ: హైదరాబాద్ జిల్లాలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుల పరిశీలన, ఆమోదంలో జాప్యం జరుగుతుండటంతో ఆర్థిక సాయం కోసం కొత్త జంటలు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొందరు దరఖాస్తుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తున్నారు.
రూ.1,00,116 సాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన అర్హులైన యువతుల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహాలకు షాదీముబారక్ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుకు రూ.1,00,116 చొప్పున సాయం అందుతున్నట్లు సమాచారం.
విచారణలో జాప్యం
గతంలో వీఆర్వో వ్యవస్థ ఉండటంతో దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ వేగంగా జరిగేది. అయితే వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో ఈ బాధ్యతలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లపై పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇతర రెవెన్యూ పనులతో పాటు దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి విచారణ చేయాల్సి రావడంతో ప్రక్రియ ఆలస్యమవుతోందనే వాదనలు ఉన్నాయి.
9,820 దరఖాస్తులు
హైదరాబాద్ జిల్లాలో గత నాలుగు నెలల్లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం 9,820 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో ఇప్పటివరకు 2,498 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో 35 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
సాయం కోసం ఎదురుచూపులు
వివాహం అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఈ పథకాల సాయం ఎంతో కీలకంగా మారింది. దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో నగదు అందేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
