* రుణమాఫీపై తుమ్మల వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని బీఆర్ ఎస్(BRS) నిర్ణయించింది. ఈమేరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణ భవన్లో ఈరోజు భేటీ అయ్యారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తామని చెప్పారు. కాగా, రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్(Congress) అంటోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలకు కామెంట్లకు గట్టిగా కౌంటర్ ఇస్తోంది. తాము ఇచ్చిన మాట ప్రకారం.. అర్హులైన రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందు కోసం మూడు విడతల్లో రూ. 31 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అర్హులైనా రుణమాఫీ కాని రైతుల కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే,రుణమాఫీపై మంత్రి తుమ్మల(Minister Thummala) కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 2 లక్షలకు పైగా ఉన్నవారు పై మొత్తాన్ని కడితేనే రూ. 2 లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీ పై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలోని బాకీలను కూడా చెల్లించామన్నారు. రైతులను మోసం చేసే సంస్కృతి తమ ప్రభుత్వానిది కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు..
————————–