
త్వరలోనే టీపీసీసీ చీఫ్ ప్రకటన
* ఢిల్లీలోనే ఆశావహులు, కాంగ్రెస్ సీనియర్లు
* సీఎం రేవంత్ రెడ్డి సైతం హస్తినలోనే..
* నేడో, రేపో ప్రకటించే చాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎంపికపై హస్తినలో జోరుగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత చీఫ్.. రేవంత్ రెడ్డి (Revanth Reddy)ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతుండడంతో వేరే ఒకరికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచే దీనిపై చర్చ జరుగుతోంది. హేమాహేమీలు ఈ పదవి కోసం పోటీపడుతుండడంతో ఎవరిని నియమించాలో తెలియక వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై ఏదో ఒకటి తేల్చేయాలని అధిష్ఠానం మేధోమధనం చేస్తోంది. ఈక్రమంలోనే ఢిల్లీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ఎవరికి ఇద్దాం..
టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే తుదిదశకు వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ పర్యటనను రద్దుచేసుకుని మరీ రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు.. సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహా పలువురు సీనియర్ల అభిప్రాయాలను ఏఐసీసీ సేకరిస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ కూడా ఈ అంశంపై సోనియాగాంధీని కలిశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి,, దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారు.
సామాజిక సమీకరణాల ఆధారంగా వడబోత
ఇప్పటికే నలుగురి జాబితాతో ఒక అంచనాకు వచ్చిన అధిష్ఠానం సామాజిక సమీకరణాల ఆధారంగా వడబోతలో నిమగ్నమైంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందినవారిలో ఒకరికి పీసీసీ చీఫ్ పదవిని అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీ పేర్లు కూడా అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ గౌడ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. రాష్ట్రంలో పుంజుకుంటోన్న బీజేపీ బీసీ నాయకత్వం వైపే మొగ్గుచూపుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పీసీసీ పగ్గాలను అదే వర్గానికి ఇస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేసులో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పేరు కూడా వినిపిస్తోంది. ఎస్సీ సామాజికవర్గాలకు ఇవ్వాల్సి వస్తే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముందువరుసలో ఉన్నారు. పీసీసీ పగ్గాలను మాదిగలకు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. ఈనేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ రేసులో ఉన్నారు. సీనియర్ల అభిప్రాయం, రాష్ట్ర, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక జరగనుంది. వీలైనంత త్వరలోనే.. నేడో, రేపో ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
————————