Land Acquisition Compensation
* VCK రాష్ట్ర అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్ ఆగ్రహం
ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రాజెక్టుల కోసం వ్యవసాయ భూములను సేకరిస్తున్న సమయంలో ఆయా భూముల్లో ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలకు కూడా చట్ట ప్రకారం పరిహారం అందించాలని విసికె (VCK) పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదునూరి వెంకట్రాజం డిమాండ్ చేశారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధిత వ్యవసాయ కూలీలతో కలిసి నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. భూసేకరణ సందర్భంగా రైతులకు పరిహారం అందిస్తున్నప్పటికీ, అదే భూములపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేద వ్యవసాయ కూలీలకు పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో భూసేకరణ జరుగుతోందని నాయకులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు తదితర అభివృద్ధి పనుల కోసం భూములు సేకరించే సమయంలో భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, పశుపోషకుల జీవనోపాధిపై కూడా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
భూసేకరణతో ఉపాధి కోల్పోయిన కూలీలకు R&R ప్యాకేజీ కింద పరిహారం అందించాల్సి ఉన్నప్పటికీ, హనుమకొండ జిల్లాలో ఈ అంశాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే నిరుపేద కూలీలకు అందాల్సిన ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు భూసేకరణ జరిగిన అన్ని గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలను గుర్తించి, వారికి చట్టబద్ధంగా అందాల్సిన పరిహారం వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే న్యాయపోరాటంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మునగాల బిక్షపతి, కర్రే లక్ష్మణ్, VCK పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నాల రవి, నాయకులు కొట్టేపాక రవి, మాదాసు యాకుబ్, బొట్టు బిక్షపతి, సునీల్, ఇలసాగరం వీరయ్య, జేరిపోతుల ఏసోబు, జేరిపోతుల సారంగపాణి, ఇలసాగరం సమ్మయ్య, పూల విజయ, తొట్ల భాగ్య, ఈగ నరసమ్మ, మామిండ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
