విక్టరీ వెంకటేష్
* మల్లీశ్వరి స్థాయిలో ఆదర్శ కుటుంబం అలరిస్తుంది
* వెంకటేష్ ధీమా
Venkatesh| ఆకేరు న్యూస్, సినిమా: విక్టరీ వెంకటేష్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 30, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో చిత్ర బృందం సినిమా విశేషాలను వెల్లడించింది.
ప్రేక్షకులను అలరిస్తుంది
ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదని హీరో వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ‘ఆదర్శ కుటుంబం’ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాం. కొత్త తరహాలో రూపొందించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని వెంకటేష్ పేర్కొన్నారు.
మంచి కథ కోసమే ఆలస్యం
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు మంచి కథను అందించాలనే ఉద్దేశంతోనే ఇంత సమయం తీసుకున్నామని తెలిపారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల తర్వాత మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించామని చెప్పారు. ‘ఆదర్శ కుటుంబం’ అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదించాలని కోరారు.
పాత్రపై నారా రోహిత్ ఆనందం
ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు నటుడు నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో నటించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలను ఎన్నోసార్లు చూశానని, ఈ చిత్రంలో భాగం కావడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాకు కూడా లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తమన్ సంగీతంపై అంచనాలు
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో భాగస్వామిని చేసిన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలోని ప్రతి విభాగం ఎంతో శ్రద్ధగా పనిచేసిందని చెప్పారు. చిత్రంలోని ఎనిమిది పాటలతో విడుదల చేసిన జ్యూక్బాక్స్కు మంచి స్పందన వస్తోందని వెల్లడించారు. సినిమా ఫైనల్ కాపీ చూసి చిత్ర బృందం సంతోషంగా ఉందన్నారు. వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్‌ల నటనను ప్రశంసించారు.
భారీ తారాగణంతో..
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీమతి మమత సమర్పిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్, ఏ.ఎస్. ప్రకాశ్ కళా దర్శకత్వం నిర్వహించారు.
రేపే థియేటర్లలోకి..
వెంకటేష్–త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన సినిమాల స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

