పల్లెల్లో నిజమైన జ్ఞానం దాగి ఉంది. .
* పల్లెల్లో 400 ఆవిష్కరణలు గుర్తించారు
* 44 పేటెంట్లు, ఎన్నో అంతర్జాతీయ అవార్డులు
* 2500 సాంప్రదాయ జ్ఞానాన్ని రికార్డ్ చేశారు
* ఆర్మీలో 35 ఏళ్ళ సర్వీస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
పల్లెలు సృజనాత్మక కేంద్రాలు . నిరంతరం ఎన్నో ఆవిష్కరణలు జరుగుతాయి. కాని అవి వెలుగు చూడవు . ప్రజల నిజమైన అవసరాలు ప్రయోగశాలలో జరిగే పరిశోధనకు పొంతన లేకుండా పోతున్నాయి. వ్యవసాయ రంగంలో ఈ అంతరం మాత్రం మరింత ఎక్కువగా ఉంటోంది. పల్లెల్లో దాగిన అపురూప ప్రతిభకు గుర్తింపు లేకుండా పోతుంది. ఇదీ గమనించి పల్లె సృజనాత్మకతను ఒడిసి పట్టి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు పల్లె సృజన సంస్థ వ్యవస్థాపకులు బ్రిగేడియర్ పోగుల గణేశం. 35 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఇండియన్ ఆర్మీలో పని చేశారు. సిద్దిపేట జిల్లా లోని భూంపల్లి గ్రామానికి చెందిన బ్రిగేడియర్ గణేశం పదవి విరమణ అయిన వెంటనే పల్లె సృజన అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆయనకు పల్లె ప్రజల జ్ఞానం పై అపారమైన గౌరవం ఉంటుంది. పల్లె ప్రజలకు కోపం వచ్చినా.. బాధనిపించినా అద్భుతమైన ఆవిష్కరణలు పురుడు పోసుకుంటాయంటారు. బ్రిగేడియర్ పోగుల గణేశం ఆకేరు న్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. పల్లెల్లో దాగిన అపురూప ప్రతిభ గురించి లోతైన విశ్లేషణ చేశారు.
* పొట్టి ఆఫీసరే ఆర్మీలో చేరడానికి స్పూర్తి ..
పోగుల గణేవం ఆర్మీ ప్రవేశం ఒక ఆసక్తికర సన్నివేశం ద్వారా జరిగింది . ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నేవీ రిక్రూట్ మెంట్ కోసం అధికారులు వచ్చారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఆర్మీ , నేవీ రిక్రూట్ మెంట్లు జరిగేవి. అలాంటి సందర్భంలో అందరూ వెళ్ళినట్టే చేరడానికి కాకుండా చూడడానికి అక్కడికి వెళ్ళారు. ఇండియన్ ఆర్మీ, నేవీలో చేరేందుకు విద్యార్థులను మోటివేట్ చేస్తున్న నేవీ ఆఫీసర్ గణేషంకు స్పూర్తిగా నిలిచారు. ఆర్మీ, నేవీ ఆఫీసర్లు అంటే మాటలా… ఆరడుగుల ఎత్తులో బాహుబలిని తలపిస్తారని అందరం అనుకుంటాం కదా.. అయితే ఆ నేవీ ఆఫీసర్ పొట్టివాడట .ఆ పొట్టి తనమే తనకు ఆర్మీలో చేరాలన్న తలంపు కలిగింది అంటున్నారు బ్రిగేడియర్ పోగుల గణేషం తాను కూడా పెద్దగా ఎత్తు కాదు కాబట్టి ఆర్మీలో జాయిన్ అవడానికి అర్హున్ని కాదనుకున్నాడంటారు. ఆ అధికారిని చూసిన తర్వాత ఆసక్తి కలగడంతో ఆర్మీలో జాయిన్ కావాల్సి వచ్చిందంటారు.
* పల్లె ప్రజలకు – ప్రకృతికి మద్య ఆత్మీయ అనుబంధం
పల్లె ప్రజలకు ప్రకృతికి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంటుంది. దీని అర్థం చేసుకోవడానికి పల్లె సృజన శోదయాత్ర చేస్తుంది మూడు రోజులపాటు 60 కిలోమీటర్లు పల్లెల్లో పాదయాత్ర చేపడతారు. ప్రకృతి ప్రజలు ప్రజలు మధ్య ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకుంటాం. పల్లె జ్ఞానాన్ని పరిశోధించడమే శోదయాత్ర అతి ముఖ్యమైన కార్యాచరణ. గుర్తించిన ఆవిష్కరణలకు సంబందించి అవసరమైన సాంకేతిక సలహాలు, మార్కెటింగ్ సూచనలు, పేటెంట్ల కోసం కృషి చేయడం లాంటి అనేక పనులు చేస్తామని చెప్పారు. వాళ్ళ సాంప్రదాయ జ్ఞానాన్ని, వాళ్ళ ఇన్నోవేషన్ ని పల్లె సృజనను పంచుకోవడానికి ఒప్పుకుంటే పేటెంట్ కోసం, అవార్డ్ ల కోసమా . ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తుందా..? అని ఆలోచిస్తాం.
* మల్లేశం ఆసు యంత్రం ప్రస్థానంలో పల్లె సృజన కీలకం
నల్గొండ జిల్లాకు చెందిన మల్లేశం తన తల్లి బాధ చూసి చలించి ఆసు యంత్రాన్ని తయారు చేశాడు. ఆయన తల్లి ఆసు పోయడం కోసం 2000 సార్లు చేయి ఊపేది.. అలా ఊపక పోతే ఒక్క చీరకూడా మగ్గానికి ఎక్కదు.
ఆమె భుజం నొప్పితో బాధపడేది. ఆమ్మ బాధ చూసి .. బాధపడేవాడు. అమ్మకు బాధ ఎందుకు వస్తుంది.. అంటే చేయి ఊపడం వల్ల.. చేయి ఇంకెవరైనా ఊపితే.. అదీ మెషిన్ అయితే బాగుంటుంది కదా.. అని ఆలోచించాడు. 6 వతరగతి డ్రాప్ అవుట్ 14 ఏళ్ళ వయసున్న మల్లేశం . బాధ నుంచి టెక్నాలజీ గురించి వచ్చింది. టెక్నాలజీ ని క్రియేట్ చేసి సమస్య కోసం వెతుకుతున్న పరిస్థితి ఉందంటారు పోగుల గణేశం. మల్లేశం ఏడేళ్ళు కష్టపడి సాధించాడు. ప్రజలు అభినందిస్తారు. దండలు వేస్తారు, శాలువాలు కప్పుతారు. ఆ తర్వా త ఏం చేయాలో పల్లె సృజన చేస్తుంది. మల్లేశం తయారుచేసిన ఆసు మిషన్లు 3 వేలు కావాలి. ఎవరు తయారు చేస్తారు. అందుకోసం డబ్బులు కావాలి. పేటెంట్ తీసుకోవాలి లేదంటే మరొకరు కాపీ కొడతారు. 2007 లో మల్లేశం ఇంటికి వెళ్ళాం. అద్భుతం అనిపించింది. జాతీయ అవార్డుల కోసం తీసుకెళ్ళాను. ఒక వారం రోజుల తర్వాత అబ్దుల్ కలామ్ తో ఒక గంట పాటు మల్లేశం సమావేశం జరిగింది. ఆయన ఆర్థిక సహాయం వల్ల దేశమంతా తిరిగాడు. తర్వాత పేటెంట్ వచ్చింది. తర్వాత పద్మశ్రీ వచ్చింది. రాష్ట్ర పతి భవన్లో అతిథిగా 15 రోజులు ఉన్నాడు. ప్రతీ ఆవార్డుకు రాసే పద్దతి ఉంటుంది. ఆ పనులన్నీ పల్లె సృజన చేసింది.
* 44 పేటెంట్లు, ప్రఖ్యాత సంస్థల ఎంవోయూలు
పల్లె సృజన సంస్థ పనితీరు వల్ల సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.ఎన్నో అంతర్జాతీయ స్థాయి అవార్డులు, 13 రాష్ట్రపతి అవార్డులు, 44 పేటెంట్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శోధించి ఇప్పటి వరకు 2500 సాంప్రదాయ జ్ఞానాన్ని రికార్డు చేశారు. ఇంకా ఎన్నోరకాల పల్లె ఆవిష్కరణలను ప్రజలకు పరిచయం చేస్తూనే ఉన్నారు.
———————–