– భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లో నీటమునిగిన ఇళ్లు
– పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు
– పలు కాలనీలను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు
ఆకేరున్యూస్, వరంగల్ : వరంగల్ మహానగరంతో పాటు విలీన గ్రామాలలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. బల్దియా అధికారులు సమస్యాత్మక ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
పునరావాస కేంద్రాలకు తరలింపు..
వరంగల్ ట్రైసిటీస్ పరిధి లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న దాదాపు 500ల మంది బాధితులను బల్దియా సిబ్బంది పునరావాస ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించారు. సుమారు 25చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు.
కాజీపేటలో..
కాజీపేటలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలోని జూబ్లి మార్కెట్, బాపూజీ నగర్, డీజిల్ కాలనీ పరిసర ప్రాంతాల కాలనీలు నీట మునిగాయి. పలు కాలనీళ్లో ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో కాజీపేట ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, ఏఆర్ఐ అక్కడికి చేరుకుని నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం అందించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.
మడికొండలో..
భారీ వర్షాల కారణంగా మడికొండలో రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరుకుని చెరువులను తలపిస్తున్నాయి. ఇన్స్పెక్టర్, మహిళా ఎస్సై, కాంగ్రెస్ నాయకులు కలిసి ఎక్స్ కవేటర్ తో నీటిని దారిమళ్లించారు. మడికొండలోని మెట్టుగుట్టపైకి వెళ్లే ఘాట్‌రోడ్డుపై గుంత ఏర్పడింది.
వడ్డేపల్లిలో..
వడ్డేపల్లి ప్రాంతంలో భారీ వర్షాలకు అశోక కాలనీ, భవానీ నగర్, సమ్మయ్య నగర్, ఇంజినీర్స్ కాలనీ, రాఘవేంద్ర నగర్ ఫేజ్-2, ఇందిర నగర్, గోపాల్పూర్ ద్వారకా సాయి కాలనీ ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీ నీరు పొంగి రోడ్డుపైనే ప్రవహించింది. దీంతో అశోక కాలనీ ప్రాంతంలోని అంబేద్కర్ భవన్ రోడ్డు, భవానీ నగర్ ప్రాంతాల్లోని నివాస గృహాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.
రెడ్డీ కాలనీలో..
హన్మకొండలోని రెడ్డీ కాలనీ వరద నీటిలో మునిగి పోయింది. నాలుగో డివిజన్ శ్రీరంగ ఆస్పత్రి లైన్ లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది.
ఉప్పొంగిన ఆకేరు..
ఐనవోలు మండలంలో 91 చెరువులు, కుంటలు ఉండగా వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఆదివారం వరకు 40 చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి.
జాతీయ రహదారిపైకి చేరిన వరద నీరు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఐనవోలు మండలంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి563 పంథిని వద్ద ఎగువ నుంచి వస్తున్న వరద నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాలతో పంథిని లోని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ బండి మహేందర్ ఎక్సవేటర్‌ను ఏర్పాటు చేసి నీటి ప్రవాహం రహదారిపైకి, ఇళ్లలోకి చేరుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
నగరంలోని 14వ డివిజన్ పరిధి సాయిగణేష్ కాలనీ, మధురానగర్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, బాలాజీనగర్, ఎస్సార్ నగర్, గాంధీనగర్ 100ఫీట్ల రోడ్డుపై భాగాన ఉన్న మణికంఠ కాలనీలు అన్ని జలమయం అయ్యాయి.
మధ్యకోటను ముంచెత్తిన వరద నీరు..
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతం అతలాకుతలమైంది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా అధికారులు అండర్ బ్రిడ్జి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. రాతి, మట్టికోట చుట్టూ ఉన్న అగర్తలు మత్తడి పడడంతో శివనగర్, పెరికవాడ, మైసయ్యనగర్, పాడి మల్లారెడ్డి, సాకరాశికుంట, సాకరాశికుంట, కాశికుంట, ఎస్ ఆర్ ఆర్ తోట జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోట ప్రాంతంలోని సుమారు 120 ఎకరాల ఆకుకూర తోటలు జలమయం అయ్యాయి.
హసన్‌పర్తిలో..
హసన్ పర్తి పరిధి అనంత్‌సాగర్, మడిపల్లి, జయగిరి చెరువులు మత్తడి పోస్తున్నాయి. 1, 55, 56, 65, 66 డివిజన్ లలో రోడ్లపైకి నీరు చేరింది.
హనుమకొండలో..
హన్మకొండలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్డులో భవాని నగర్, స్నేహనగర్ ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బంది పడ్డారు. అంబేద్కర్ భవన్ వద్ద గోకుల్ నగర్ కూడలిలో వరద నీరు చేరడంతో రాకపోకలకు అందరాయం ఏర్పడింది. కేయూ ఎంప్లాయీస్ కాలనీ, ఇందిరానగర్ ప్రధాన రోడ్డు జలమయం అయింది. హన్మకొండ బస్టాండ్ సమీపంలో వరదనీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
పునరావాస కేంద్రాలకు తరలిందపు..
లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డీఆర్, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఆహార ఏర్పాట్లు కల్పించారు.