*వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా..
ఆకేరు న్యూస్ వరంగల్ : గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించి యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ విధ్యార్థులకు సూచించారు. బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో (Vaagdevi Engineering College) మామునూర్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishor Jha) హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో వుందని అప్రమత్తంగా వుండాలని తెలియజేశారు. కేవలం క్షణికానందం కోసం మత్తు పదార్థాల సేవించడం వల్ల జరిగే నష్టాన్ని వివరించి చెప్పారు.. మత్తు పదార్థాలను సేవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేరని ఓ కలగానే మిగిలి పోతుందన్నారు. కొంత మంది వ్యక్తులు డబ్బు సంపాదన కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి స్వార్థపరుల చేతుల్లో యువత బలికావద్దని పేర్కొన్నారు. ఎన్నో అశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకై ఎదురుచూసే తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చవద్దని, మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి అని కమిషనర్ సూచించారు.
పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారనేది పోలీస్ కమిషనర్ తెలియజేశారు. మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయని వీటన్నింటిని యువత దృష్టిలో పెట్టుకోవాలన్నారు.. మీ తోటి మిత్రులు గంజాయిని సేవిస్తున్నట్లయితే మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే నష్టాలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చోరవ చూపిస్తోందని, ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి నియంత్రణకై డ్రగ్స్ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవిస్తున్న, రవాణా, విక్రయాలు పాల్పడుతున్న వారిని పట్టుకోవడానికి ఈ విభాగం పనిచేస్తుందన్నారు. ఎవరైన మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన 8712584473కు సమాచారం అందించాలన్నారు.. వారిపై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. పెద్దఎత్తున గంజాయి సమచారం అందించిన వారికి నగదు పురస్కారం ఉంటుందన్నారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ సమావేసంలో ఈస్ట్‌జోన్ డిసిపి రవీందర్, మామూనూర్ ఎసిపి తిరుపతి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి , ఇన్స్‌స్పెక్టర్ రవి, ఏనుమాముల ఇన్స్‌స్పెక్టర్ పులిరమేష్, వాగ్దెేవి కళాశాల ప్రిన్స్‌పాల్స్ డా. ప్రకాశ్, డా.సయ్యద్ ముస్తాక్ ఆహ్మద్ం వైస్ ప్రిన్స్‌పాల్ డా.తిరుపతి, ఎస్.ఐ శ్రీకాంత్, సంగెం ఎస్.ఐ సురేష్‌తో పాటు కళాశాల అధ్యాపకులు, విధ్యార్థులు పాల్గోన్నారు.
—————————————————————-