Singareni CMD Dr. Buddha Prakash
* సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక పురోగతిలో సింగరేణి కాలరీస్ సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డా. బుద్ధప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనం సమర్పించారు.
* ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం..
జెండా ఆవిష్కరణ అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి సీఎండీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, దేశ పురోగతిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రగతి ఫలాలు ప్రజలకు చేరాలంటే ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఉద్యోగులు, కార్మికుల అంకితభావం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రగతి ప్రయాణంలో సింగరేణి సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, కార్మికులు తమ విధులను నిబద్ధతతో నిర్వహించడం ద్వారానే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లగలమని ధీమా వ్యక్తం చేశారు.
* బొగ్గు ఉత్పత్తితోపాటు సంక్షేమానికి ప్రాధాన్యం..
సింగరేణి సంస్థ కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రధాన ఇంజిన్‌గా నిలిచిందని సీఎండీ తెలిపారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తులను పెంచడంతో పాటు ఉత్పాదకత, కార్మికుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి సింగరేణీయుడు స్వచ్ఛందంగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
* ప్రజా పాలన స్ఫూర్తితో పారదర్శక సేవలు..
ప్రజా పాలన దినోత్సవం ఇచ్చే స్ఫూర్తితో పారదర్శకత, సేవాభావం, జవాబుదారీతనంతో విధులను నిర్వర్తించాలని ఉద్యోగులకు సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలను వేగవంతం చేయడమే కాకుండా, అభివృద్ధి ఫలాలను సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందించాలనే సంకల్పంతో పనిచేయాలని కోరారు. సమష్టి కృషితోనే నిర్దేశిత లక్ష్యాలను వేగంగా సాధించగలమని స్పష్టం చేశారు.
ఈ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర పురోగతికి అనునిత్యం శ్రమిస్తూ, సింగరేణి కీర్తి ప్రతిష్టలను మరింత ఎత్తుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు పునరుద్ఘాటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
