* ఉమ్మడి వరంగల్ జిల్లా అస్తవ్యస్థం
* పలుచోట్ల ఆస్తి, ప్రాణ నష్టం
* డ్రైనీజీల్లో పొంగిపొర్లిన వర్షపు నీరు
* రోడ్డుపైకి వరద జలాలు చేరడంతో నిలిచి పోయిన వాహనాలు
* పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు ధ్వంసం
* రక్షణ ఏర్పాట్లు చేపట్టిన అధికారులు, ప్రజా ప్రతినిధులు
* బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు
* భోజన వసతి ఏర్పాటు
* అత్యవసరమైతేనే ఇళ్లనుంచి బయటకు రావాలని అధికారుల విజ్ఞప్తి
ఆకేరున్యూస్, ఉమ్మడి వరంగల్ జిల్లా: రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయింది. చెరువులు, కుంటలు, జలాశలాలు నిండి పోయాయి. పలు చోట్ల చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. డ్రైనేజీలు నిండి రోడ్డుపైనే ప్రవహించాయి. రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు, బాటసారులు ఇబ్బంది పడ్డారు. వరంగల్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు, హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే రైళ్లు భారీ వర్షాలకు ట్రాక్‌లు దెబ్బతినడంతో ఎక్కడి కక్కడే నిలిచిపోయాయి. సోమవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో రైల్వే అధికారులు ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, జిల్లా వ్యాప్తంగా వరద నీటిలో చిక్కుకున్న ప్రజల కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు రక్షణ చర్యలు చేపట్టారు. ముంపు బాధిత ప్రజలను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన వసతి కల్పించారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో శనివారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో అతిభారీ వర్షం పడింది. వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నారావుపేట మండలం పాపయ్య పేటలో ఊర చెరువుకు బుంగ పడడంతో అప్రమత్తమైన అధికారులు బుంగను పూడ్చారు. పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో రోడ్డుపై చెట్టుపడడంతో వాహనాలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కావ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని బీఆర్‌నగర్, ఎంఎన్ నగర్, ఎన్టీఆర్ నగర్, అండర్ బ్రిడ్జి, తెలంగాణ కాలనీ ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వారు పర్యటించారు. ముంపు బాధితులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంత వాసుల కోసం 31 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. విద్యుత్, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు కాలనీళ్లో ఇంట్లోకి నీరు చేరడంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. జిల్లా పరిధిలో పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. చెరువులు, వాగులు పొంగి పొర్లాయి. కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లి రహదారిపై ప్రవహించాయి. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల కారణంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి తెలిపారు. భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు సోమవారం సెలవు ప్రకటించాయి.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గోకుల్ నగర్ కూడళి, అంబేద్కర్ భవన్ వద్ద చేరిన వరద నీటిని పరిశీలించారు. వరదనీరు వెంట వెంటనే వెళ్లేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జనగామ జిల్లాలో..
జనగామ జిల్లాను ఆదివారం జోరువాన ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి మొదలైన వర్షం కారణంగా జిల్లాలోని అన్ని మండలాల చెరువులు, కుంటలు నిండిపోయాయి. పలు చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయి. దీంతో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. పాలకుర్తి మండలం నారాయణగూడెం-వావిలాల గ్రామాల మధ్య నల్లిగానికుంట తండాకు వెళ్లే రోడ్డు వర్షానికి కొట్టుకు పోయింది. కొడకండ్ల మండలం రామవరం వద్ద రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. దేవరుప్పుల మండలం కడవెండి చెక్ డ్యాం వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
మహబూబాబాద్ జిల్లాలో..
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో పాటు మత్తళ్లు పోస్తున్నాయి. మున్నేరు వాగులో నీరు ఉద్రిక్త స్థాయికి చేరుకొని రోడ్డుపైనే ప్రవహిస్తుండడంతో మహబూబాబాద్-వరంగల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సింహులపేటలో వరదలో కాడెద్దులు కొట్టుకుపోయాయి. జిల్లా లోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కురవిలోని పెద్ద చెరువు అలుగుపడి రహదారి కొంతమేర కొట్టుకుపోయింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. గణపురం మండలంలో లోలెవల్ కాజ్‌వేలు పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాటారం మండలంలో పత్తిపంట నీటమునిగింది. చిట్యాల, ఘనపురం మండలాల్లో చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి.
ములుగు జిల్లాలో..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ములుగు జిల్లా మండలం కాల్వపల్లి వద్ద వెంగమాంబ చెరువు మత్తడి వరదలో మునిగి జెరిపోతుల మల్లికార్జున్ అనే వ్యక్తి మరణించాడు. తాడ్వాయి-పస్రా మధ్య మొండెల తోగు, జలగలంచ వద్ద వరద నీరు 163 జాతీర రహదారిపై ఉధృతంగా ప్రవహించడంతో శనివారం సాయంత్రం రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరు నాగారం మండలంలో జంపన్న వాగు ఒడ్డున ఉన్న బూటారం గ్రామానికి చెందిన 230మందిని ముందస్తుగా అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు.