Warangal Bike Theft Gang
* వరంగల్‌లో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
* ఇద్దరు నిందితుల అరెస్ట్..
ఆకేరు న్యూస్, వరంగల్:
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్తున్న ఇద్దరు కేటుగాళ్లను వరంగల్ సీసీఎస్, కేయూసీ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 25 లక్షల విలువ చేసే 28 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ శ్వేతా వెల్లడించారు.
ఈజీ మనీ కోసం దొంగతనాలు… మంచిర్యాల జిల్లాకు చెందిన దొంతుల ప్రశాంత్ కుమార్ (20), దుర్గం సాయి కార్తీక్ (21) జాలీ జీవితం గడిపేందుకు, సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాల బాట పట్టారు. తెలంగాణలోని పలు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని పార్క్ చేసిన బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించారు.
* ఇలా దొరికిపోయారు..
ఇటీవల కమిషనరేట్ పరిధిలో వాహనాల చోరీలు పెరగడంతో, ఇతర నేరాలు జరగకుండా నిరోధించేందుకు డీసీపీ కవిత ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారు ప్రయాణిస్తున్న పల్సర్ బైక్‌ను తనిఖీ చేసి, క్షుణ్ణంగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో మునిపల్లి, ఎలుకతుర్తి పరిసర ప్రాంతాల్లో దాచి ఉంచిన 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* వివిధ జిల్లాల్లో చోరీలు..
ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా పలు కమిషనరేట్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తేలింది. కరీంనగర్ లో 9 బైక్‌లు, వరంగల్ లో 8 బైక్‌లు, హైదరాబాద్ & రామగుండం లో 3 బైక్‌లు, సిద్దిపేట & భూపాలపల్లి లో 2 బైక్‌లు, రాచకొండలో 1 బైక్. స్వాధీనం చేసుకున్న వాటిలో స్ప్లెండర్, పల్సర్, షైన్, గ్లామర్, హార్నెట్ వంటి ప్రముఖ కంపెనీల వాహనాలు ఉన్నాయి. నిందితులపై గతంలోనూ పలు నేరారోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బైక్‌ల అసలు యజమానులను గుర్తించి త్వరలోనే వాటిని అప్పగిస్తామని స్పష్టం చేశారు.
* ప్రజలకు పోలీసుల జాగ్రత్తలు
వాహనదారులు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని, హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్స్ వంటిదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని డీసీపీ సూచించారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే 100కి ఫోన్ చేయాలని కోరారు.
కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్, కేయూసీ ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐలు, ఐటీ కోర్ టీమ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీలు నర్సింహారావు, సదయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
