Warangal Muslims Rain Prayers
ఆకేరు న్యూస్ , వరంగల్ : భానుడి భగభగలు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలకు ఉపశమనం కలగాలని కాంక్షిస్తూ వరంగల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ (IYM) ఆధ్వర్యంలో 20 జూన్ శనివారం ఉదయం 7:30 గంటలకు వరంగల్లోని మట్వాడా ఈద్గా మైదానంలో ఈ ప్రత్యేక ప్రార్థనలు నమాజ్-ఎ-ఇస్తిస్ఖా జరగనున్నాయి.
* సున్నత్-ఎ-నబవి మార్గంలో..
ఇస్లాం ధర్మం ప్రకారం వర్షాలు లేక కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు అల్లాహ్ అనుగ్రహం కోసం, వర్షాల కోసం మైదానాల్లో సామూహికంగా ప్రార్థనలు చేయడం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన మార్గం సున్నత్. హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ ఆధారంగా.. ప్రవక్త గారు వర్షం కొరకు దువా చేయడానికి ఈద్గాకు విచ్చేసి, ఖిబ్లా వైపు తిరిగి, తన చాదర్ (దుప్పటి) వైపు మార్చి, రెండు రకాతుల నమాజ్ పూర్తి చేశారని నిర్వాహకులు తెలిపారు.
* నిర్వాహకుల పిలుపు
ఈ పవిత్రమైన కార్యం ద్వారా అల్లాహ్ తాలా కరుణించి వరంగల్ ప్రాంతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చల్లని వర్షాలు, రహమత్ అనుగ్రహం కురిపించాలని ఉమ్మడి దువా సామూహిక ప్రార్థన చేయనున్నారు. వరంగల్ నగరంలోని ముస్లిం సోదరులందరూ ఈ ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ (IYM) ప్రతినిధులు కోరారు.
————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
