Bharat Tiwari Encounter
* మృతదేహంతో 4 గంటల ఆందోళన
* పోలీసుల సస్పెన్సన్
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌతీ గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు భరత్ భూషణ్ తివారి (BHARAT TIWARI) పోలీస్ ఎన్కౌంటర్లో మరణించడం తీవ్ర వివాదానికి, ప్రజా ఆగ్రహానికి దారితీసింది.
సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్స్, వైరల్ అవుతున్న వీడియోల మధ్య రెండు రోజుల పాటు జరిగిన ఈ హైడ్రామా చివరకు విషాదాంతమైంది. దారుణమైన విషయం ఏంటంటే తన ఎన్ కౌంటర్‌ను భరత్ భూషణ్ తనే లైవ్ స్ట్రీమింగ్ చేశాడు..
* ఎవరీ భరత్ భూషణ్ తివారి..?
భరత్ భూషణ్ తివారి భోజ్‌పూర్ జిల్లా బిలౌతీ గ్రామ నివాసి. ఆయన తండ్రి రిటైర్డ్ పోలీస్ డ్రైవర్. భరత్ తివారి సోషల్ మీడియా వేదికగా తన గ్రామ సమస్యలను, ముఖ్యంగా వరదలు, భూక్షయం వంటి స్థానిక ఇబ్బందులను నిరంతరం ప్రస్తావిస్తూ ఉండేవాడు.
తనను తాను ఒక “క్రాంతికారి” (విప్లవకారుడు) గా అభివర్ణించుకునేవాడు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం, రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ గట్టిగా డిమాండ్ చేసేవాడు.
* పోలీసులు ఎందుకు ఎన్కౌంటర్ చేశారు?
భోజ్‌పూర్ పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 16, 17 తేదీల్లో భరత్ తివారి తన వద్ద ఉన్న తుపాకీతో బహిరంగంగా గాల్లోకి కాల్పులు జరుపుతూ, జగదీష్పూర్ ఎస్డిఎమ్ (SDM) కు మరియు పోలీసులకు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు ఇచ్చాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బలగాలు బిలౌతీ గ్రామానికి చేరుకున్నాయి.
భరత్ తివారి తమపైకి తుపాకీ గురిపెట్టి, “వెనక్కి తగ్గకపోతే కాల్చేస్తా” అని బెదిరించాడని పోలీసులు తెలిపారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించిన ఎస్టీఎఫ్ సిబ్బంది అతడిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించినప్పుడు, అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లో అతడి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు ప్రకటించారు.
అనంతరం చికిత్స నిమిత్తం పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) కి తరలించగా, అక్కడ అతడు మరణించాడు.
* తన ఎన్ కౌంటర్ తనే లైవ్ స్ట్రీమింగ్
ఈ ఎన్కౌంటర్ ఉదంతంపై తీవ్ర దుమారం రేగడానికి ప్రధాన కారణం భరత్ తివారి స్వయంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా రికార్డ్ చేసిన చివరి వీడియోలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, భరత్ తివారి పోలీసుల సమక్షంలో మాట్లాడుతూ.. తన డిమాండ్లను వింటామని పోలీసులు హామీ ఇచ్చారు కాబట్టి ఇక తాను తుపాకీ తిప్పాల్సిన అవసరం లేదని చెబుతూ, తన వద్ద ఉన్న పిస్తోల్‌ను పోలీసుల వైపు విసిరేసి లొంగిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆయుధాన్ని పారేసి, లొంగిపోయిన తర్వాత కూడా పోలీసులు అతడిని కాల్చి చంపారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. భరత్ తివారి మృతదేహం గ్రామానికి చేరుకోగానే గ్రామస్థులు ఆగ్రహంతో ప్రధాన రహదారిని దిగ్బంధించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. న్యాయం కావాలంటూ శవంతో ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది.
* పోలీసుల సస్పెన్షన్
ఈ ఘటన రాజకీయంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. బీహార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారి ఈ ఘటనను దురదృష్టకరమైనదిగా అభివర్ణించారు. ఒకవేళ బలప్రయోగం అనివార్యమైనా, ప్రాణాలు తీయకుండా నియంత్రించాల్సింది అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఎన్కౌంటర్ ఉదంతంపై ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ సీరియస్‌గా స్పందించాయి. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను షాపూర్ ఎస్హెచ్ఓ (SHO) రాజేష్ కుమార్ మలాకార్తో పాటు మొత్తం నలుగురు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.
* విచారణ కు ఆదేశం
ఈ వివాదాస్పద ఎన్‌కౌంటర్‌పై సమగ్ర శాఖాపరమైన, పరిపాలనాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు. లొంగిపోయినట్లు చూపిస్తున్న వైరల్ వీడియోల నిజానిజాలపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
——————–
