Gundla Singaram Hut Demolition
ఆకేరు న్యూస్,హన్మకొండ:
హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక లిక్కర్ ప్లాంట్ సమీపంలో పేదలు వేసుకున్న దాదాపు 360 గుడిసెలను రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే భారీ బందోబస్తు మధ్య తొలగించడం ప్రారంభించారు.
ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన ఆక్రమణలను తొలగిస్తున్నామని రెవెన్యూ అధికారులు చెబుతుండగా, బాధితులు మాత్రం తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము గత ఐదేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమకు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డులు కూడా ఇక్కడి అడ్రస్తోనే ఉన్నాయని వారు వాపోతున్నారు. నిన్ననే హన్మకొండ కలెక్టరేట్ వద్ద తాము ఆందోళన కూడా చేపట్టామని, అయినా కూడా అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్నపళంగా గుడిసెలను కూల్చివేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
* పోలీసుల లాఠీఛార్జ్, అరెస్టులు…
జేసీబీలతో గుడిసెలను కూల్చివేస్తున్న క్రమంలో స్థానికులు, సీపీఐ నాయకులు అధికారులను తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిరసన తెలిపిన దాదాపు 30 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేయూ (KU) పోలీస్ స్టేషన్కు తరలించారు. గుడిసెలు కోల్పోయిన పేద కుటుంబాలు రోడ్డున పడి కన్నీరుమున్నీరవుతున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
