ఆకేరు న్యూస్, వరంగల్ : భారీ వర్షాలు తెలంగాణను కూడా ఆగమాగం చేస్తున్నాయి. మొంథా ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63 సెం.మీ వర్షపాతం, ఉరుసులో 23.7 సెం.మీ, సంగెంలో 23.48 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో పరిసర ప్రాంత కాలనీలు నీటమునిగాయి. వర్ధన్నపేట లో కూడా 22.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ ముందస్తుగానే వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కాలనీల్లో కన్నీళ్లు
భారీ వర్షాలకు వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరంగల్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీ స్థాయిలో వరద నీరు నిలిచింది. శివనగర్ రోడ్డుపై నీరు నిల్వడంతో కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. హనుమకొండ బస్టాండ్, కాజీపేటలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. హసన్‌పర్తి, రామ్‌నగర్‌లో ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. ప్రధాన రోడ్లపై నీరు నిల్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నగరంలోని నాలాలు పొంగిపొర్లుతుండడంతో సమీప ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లలోకి కూడా నీళ్లు చేరడంతో వాటిని తరలించేందుకు నివాసితులు కష్టాలుపడుతున్నారు.
……………………………………………………………
