*సీఎం రేవంత్ పై తలసాని ఫైర్
* బీసీలను మభ్యపెడుతున్నారని ఆరోపణ
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్య పెడుతోందని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తానంటూ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టరూపం వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరుగాలంటూ ఓ వైపు ఎమ్మెల్సీ కవిత బీసీ జపం చేస్తూ బీసీల కు న్యాయం జరిగే వరకూ తన పోరాటం ఆగదని ప్రకటనలు చేస్తున్న నేపధ్యంలో బీఆర్ ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే బిసీ నినాదాన్ని ఎత్తుకోవడం విశేషం. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో తప్పులు ఉన్నాయని తలసాని అన్నారు. మొత్తం కులగణననే ఓ తప్పుల తడక అంటూ ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో హడావుడిగా ఆమోదించారని తలసాని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే బీసీ బిల్లు చట్టబద్దత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుకు చట్టబద్దత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తలసాని డిమాండ్ చేశారు. చట్టబద్దత లేకుండా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని తలసాని ఆరోపించారు.
………………………………………………………………
