* కోల్కతా కోర్టు తీర్పు వెనుక కారణాలేంటి?
* ఉద్యోగాలు కోల్పోనున్న 25 వేల మంది టీచర్లు
* 8 ఏళ్ల జీతం వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాల్సిన దుస్థితి
* సంచలనంగా మారిన కోల్కతా కోర్టు తీర్పు
* సుప్రీం కు వెళ్తామంటున్న దీదీ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ :
‘‘2016 నాటి ‘స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST)’ నియామక ప్రక్రియ చెల్లదు. నాటి నియామకాలు తక్షణమే రద్దు చేయండి. అంతేకాదు.. ఆ పరీక్ష ద్వారా ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి వాపసు చేయాలి. 12 శాతం వడ్డీతో సహా..’’ అంటూ కోల్కతా హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బెంగాల్లోని దీదీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. దీని వెనుక రాజకీయ కోణం ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. 8 ఏళ్ల జీతం వెనక్కి ఇవ్వాలా.., బాధితులకు అండగా ఉంటాం.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తాం.. అంటూ మమత స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ తీర్పుతో 25 వేల కుటుంబాలు ఆంతర్మథనంలో పడ్డాయి. గతంలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న బాధితులు ఆనందంలో ఉన్నారు. కాగా, నాడు జరిగిన టీచర్ల నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడడం చర్చనీయాంశంగా జరిగింది. అసలేం జరిగింది అనేది ఆసక్తిగా మారింది.
24, 650 ఖాళీలకు 23 లక్షల దరఖాస్తులు
పశ్చిమ బెంగాల్ లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్-సి, గ్రూప్-డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష రాశారు. అనంతరం సర్కారు ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేసింది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని అవకతవకలు జరిగాయని, మెరిట్ వచ్చిన వారికి కాకుండా, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటైంది.
ఇప్పటికీ కస్టడీలోనే మంత్రి
ఈ అక్రమాలన్నీ జరుగుతున్న సమయంలో విద్యామంత్రిగా పార్థ చటర్జీ ఇప్పటికీ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోనే ఉన్నారు. సీబీఐ ఆయన్ను రెండుసార్లు ప్రశ్నించింది. 2022 జూలై 23న పార్థ చటర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న అర్పితా ముఖర్జీ ఇంట్లో దాడులు చేసిన ఈడీ రూ.21కోట్ల నగదు, రూ.కోటి విలువ చేసే నగలను స్వాధీనం చేసుకుంది. పార్థచటర్జీని అరెస్టు చేసింది. వారిద్దరికీ సంబంధించిన రూ.103.10 కోట్ల విలువైన నగదు, నగలు, స్థిరాస్తులను జప్తు చేసినట్టు 2022 సెప్టెంబరులో కోర్టుకు తెలిపింది. అలాగే.. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ మాజీ సలహాదారు శాంతిప్రసాద్ సిన్హా, ప్రసన్నరాయ్ అనే మరో వ్యక్తికి చెందిన రూ.230 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
15 రోజుల్లో కొత్త నియామక ప్రక్రియ
కాగా, ప్రత్యేక డివిజన్ బెంచ్ దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం.. 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినందున ఆ పరీక్ష తీర్పు వెలువరించింది. తక్షణమే ఆ నియామకాలను రద్దు చేసి 15 రోజుల్లోనే కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ను సూచించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేయడంతో పాటు, ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నాలుగు వారాల్లోగా తాము అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. అదికూడా తీసుకున్న జీతానికి 12 శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని కోర్టు చెప్పింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. అయితే.. నియామకాలను రద్దు చేయడంతోపాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని మమతా బెనర్జీ తెలిపారు. ఈకేసు ఎటువంటి మలుపు తిరుగుతుంది అనేది సుప్రీం తీర్పుపై ఆధారపడి ఉంది.
————————–