
* యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్
* హెల్త్ బులిటెన్ విడుదల
* కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆయన అస్వస్థతకు గురి కావడంతో సోమాజీగూడా ఆస్పత్రికి వెళ్లారు. జ్వరం, జలుబు, మదుమేహానికి సంబందించిన సమస్యలు ఉండడంతో వైద్యులు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. పూర్తి స్థాయి వైద్య పరీక్షల అనంతరం యశోదా ఆస్పత్రి వైద్యులు కేసీఆర్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. హై బ్లడ్ షుగర్, సోడియం లెవల్స్ తక్కువగా ఉండడంతో పాటు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నామన్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కేటీఆర్, సంతోష్ కుమార్ , హరీశ్ రావులు ఉన్నారు. కేసీఆర్ అనారోగ్యంతో యశోదా ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న బీఆర్ ఎస్ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా కేసీఆర్ ఎలాంటి తీవ్రమైన సమస్యతో బాధపడడం లేదు. సాధారణంగా సీజన్ మారినప్పుడు వచ్చే వైరల్ ఫీవర్తో పాటు ఇతర స్వల్పమైన ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ ఎస్ నేతలు అంటున్నారు.
* కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉంది.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనకు సమాచారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రి వైద్యులకు సూచించారు.
————————-