* విమానాల్లో అదిగో బాంబు.. ఇదిగో బాంబు అంటూ ఫేక్ కాల్స్
* ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్, ఎక్స్ ద్వారా వందల సంఖ్యలో బెదిరింపులు
* వరుస బెదిరింపులపై నిఘా వర్గాల అనుమానాలు
* ఎయిర్ ఇండియాలో ప్రయాణించొద్దని ఇప్పటికే టెర్రరిస్టు హెచ్చరిక
* అప్రమత్తమైన సీఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ
* 11 రోజుల్లో 250 ఫేక్ కాల్స్
* ఒక్కరోజులోనే 95..
* నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆగమాగం
అసలేం జరుగుతోంది.. ఏం జరగబోతోంది.. వందల సంఖ్యలో విమానాలకు బాంబు బెదిరింపుల వెనుక కుట్ర దాగుందా? ప్రపంచంలోనే వేగంగా భారత విమానయానం అభివృద్ధి చెందుతున్న వేళ.. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఆకేరు న్యూస్ ప్రత్యే కథనం..
ఆకేరు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి : వాస్తవానికి ఈ బెదిరింపు కాల్స్ కొత్తేమీ కాదు. అయితే అడపా దడపా మాత్రమే ఉండేవి. 2014 నుంచి 2018 మధ్య విమానాలకు సుమారుగా 120 బాంబు బెదిరింపు కాల్స్ వస్తే.. ఈసారి కేవలం 11 రోజుల్లోనే దాదాపు 250 బెదిరింపు కాల్స్/ఈమెయిల్స్/ఎక్స్ మెసేజ్ లు వచ్చాయి. ఈనేపథ్యంలో నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా బలగాలను అప్రమత్తం చేస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలను సీఐఎస్ ఎఫ్ సీరియస్‌గా పరిగణించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
మొత్తం వ్యవస్థ ఆగమాగం..
ఒక్క చిన్న ఫోన్ కాల్/మెసేజ్ తో మొత్తం విమానయాన వ్యవస్థ ఆగమాగం అవుతోంది. అదిగో బాంబు.. ఇదిగో బాంబు అంటూ అగంతుకుల బెదిరింపుల వల్ల ఆర్థికంగా, సామాజికంగా భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. నిన్న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులోని విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్ నుంచి చంఢీఘర్ వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లుగా వచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులు, సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. విమానంలోని మొత్తం 130 మంది ప్రయాణికులను కిందికు దింపి క్షుణ్నంగా పరిశీలించారు. “ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేవు.. హమ్మయ్య” అంటూ ఊపిరిపీల్చుకున్నారు. నిన్న ఒక్క రోజే కాదు.. ఈ తరహా ఫోన్ కాల్స్ 11 రోజుల వ్యవధిలో దాదాపు 250 వరకు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే 95 వచ్చినట్లు సమాచారం. శుక్రవారం మరో 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్‌జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
అన్నీ ఉత్తివే అయినా..
ఒక్క ఈ నెలలోనే ఇండియన్ ఎయిర్ లైన్స్ పరిధిలో నడుస్తున్న విమానాలకు వందల సంఖ్యలో వచ్చిన బెదిరింపు కాల్స్ అన్నీ ఉత్తివే. అయినా ఆయా సంస్థలు, భద్రతా బలగాలు వాటిని కొట్టిపారేయడం లేదు. ఎందుకంటే ప్రయాణికుల భద్రత ఆయా సంస్థల విధి. అందుకే తనిఖీల అనంతరం అన్నీ కేవలం బెదిరింపు కాల్స్ మాత్రమే అని నిర్ధారణ అయినా తేలిగ్గా తీసుకోవడం లేదు. అటువంటి అనుమానాలు వచ్చినప్పుడల్లా పూర్తిగా పరిశీలిస్తున్నాయి. క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాకే ముందుకు సాగుతున్నాయి. ఒక్క విమానాలకే కాదు.. సీఆర్ పీఎఫ్ స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఏం చేయాలి.. ఎలా కట్టడి చేయాలి..
వరుస బెదిరింపులతో భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఇటువంటి కాల్స్ వల్ల ప్రతిసారీ భారీ మొత్తంలో ఖర్చు అవుతోంది. ఒక్కసారి విమానం ఆపినా, దారి మళ్లించినా రూ.3 కోట్ల వరకు నష్టం వస్తుందని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. బెదిరింపులు వచ్చినప్పుడు విమానాలు గాల్లో ఉంటే.. దగ్గరలో ఉన్న విమానాశ్రయంలో దింపాలి. రన్ వేలో ఉన్నప్పుడు వస్తే.. వెంటనే ఆపేయాలి.. అన్నీ తనిఖీలు చేయాలి. మళ్లీ విమానం నడిపేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి రావాలి. దీనికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాలి. అనుకోకుండా విమనాన్ని రద్దు చేస్తే వారి వసతి ఖర్చు ఆయా సంస్థలే భరించాలి. దీనివల్ల ప్రతి గంటకూ 13 లక్షల నుంచి 17 లక్షల వరకు నష్టపోతున్నట్లు అంచనా. అంతర్జాతీయ విమానాల్లో ఈ నష్టం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. మరోవైపు ప్రయాణికులకూ తిప్పలు తప్పడం లేదు. మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా బెదిరింపులను ఎలా ఎదుర్కోవాలి, ఎలా కట్టడి చేయాలి అనే దానిపై కేంద్రంగా సీరియస్‌గా చర్చిస్తోంది.
నిందితుల లొకేషన్ కనిపెట్టడం ఓ సవాల్
విమానాలకు వస్తున్న బెదిరింపుల్లో ఎక్కువగా సోషల్‌మీడియా ద్వారానే వస్తున్నాయి. ఈమెయిల్స్, ట్విటర్(ఎక్స్) ద్వారా అగంతుకులు బెదిరింపు మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ క్రమంలో నిందితుల లొకేషన్ కనిపెట్టడం అధికారులకు ఓ సవాల్‌గా మారుతోంది. ఫేక్ అకౌంట్లను కట్టడి చేయాలని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలకు భద్రతా బలగాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు నిందితులకు జీవిత ఖైదు, భారీ జరిమానా, విమానప్రయాణం నిషేధం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అయినప్పటికీ ఫేక్ కాల్స్ కు అంతులేకుండా పోతోంది.
దీని వెనుక కుట్ర దాగుందా
భారత విమానయానం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటువంటి సమయంలో ఫేక్ కాల్స్ పెరుగుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులు అనేక సర్వీసులకు అంతరాయం కలిగిస్తుండడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక మైనర్ ను, అతడి తండ్రిని మాత్రమే అరెస్ట్ చేశారు. చాలా మంది ఆచూకీ చిక్కడం లేదు. మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ఇటీవల మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ప్రయాణికులను హెచ్చరించాడు. ఆ విమానాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని పేర్కొనడం కలకలం రేపుతోంది. అయితే అతడు గతేడాది కూడా ఇలాంటి హెచ్చరికనే జారీచేశాడు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది. సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనీ హెచ్చరికలు జారీ చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ సీఐఎస్ ఎఫ్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. పలు ఎయిర్ పోర్టులను పేల్చేస్తామంటూ బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించే పనిలో ఉన్నారు.
……………………………………………