* ఎండి పోతున్న వేప చెట్లు
* వేప చెట్టు తెగులు అంటు వ్యాధి కాదు..
– ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ మాలతి
మారుతున్న కాలంతో పాటు ప్రకృతి ప్రసాదించిన ‘హెర్బల్ డాక్టర్’ వేప చెట్టుకు కూడా కష్టాలు మొదలయ్యాయి. వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి, వాటిని ఎలా కాపాడుకోవాలో వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. మాలతి ఆకేరు న్యూస్ ప్రతినిధి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు..
ప్ర: మేడమ్ నమస్తే … వేప చెట్లకు ఉన్న ప్రత్యేకత ఏంటి ..? ఇపుడెందుకు ఎండి పోతున్నాయి..?
ప్రొఫెసర్ మాలతి : వేపను హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా, భూమిపై ఉన్న “కల్పవృక్షం” అని పిలుస్తారు
దీని ఆకులు, బెరడు, గింజలు, కాయలు ఇలా ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉంటాయి .
వేప చెట్లు ఎండి పోవడానికి కారణం వైరస్ లేదా కరోనా కాదు, ‘ఫోమాప్సిస్ అజాడి రక్టే’ (Phomopsis azadirachtae) అనే ఒక రకమైన సిలీంద్రం (Fungus) వల్ల వచ్చే తెగులు ఇదీ. దీనిని ‘డై బ్యాక్’ (Die-back) లేదా కొమ్మ ఎండు తెగులు అంటారు. ఇది కొమ్మ చివర నుంచి మొదలై కిందకు వ్యాపిస్తుంది.
ప్ర: కేవలం పెద్ద చెట్లకే ఈ తెగులు వస్తుందంటారా..?
ప్రొఫెసర్ మాలతి : లేదు ఈ తెగులుకు వయస్సుతో సంబంధం లేదు. 3 ఏళ్ల మొక్కల నుంచి 30 ఏళ్ల చెట్ల వరకు దేనికైనా సోకవచ్చు.
ప్ర: ఎలాంటి లక్షణాల వల్ల వీటికి ఎండు తెగులు సోకిందని గుర్తించాలంటారు..?
ప్రొఫెసర్ : చాలా సింపుల్ , కొమ్మ చివరి భాగం నుంచి ఎండి పోతూ కనిపిస్తుంది.. క్రమంగా చెట్టంతా వ్యాపిస్తుంది.
ప్ర: ఎలాంటి సస్య రక్షణ చర్యలు చేపట్టాలంటారు..?
ప్రొఫెసర్ మాలతి : తెగులు సోకిన కొమ్మలను గుర్తించి, ఆరోగ్యంగా ఉన్న భాగం వరకు కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలను చెట్టు కిందే ఉంచకుండా కాల్చివేయాలి. కత్తిరించిన భాగాలకు ‘బోడో పేస్ట్’ (Bordeaux paste) పూయాలి. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉండే గోరింటాకు ముద్దనైనా పెట్టవచ్చు చిన్న మొక్కలైతే కార్బండిజం (Carbendazim) 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి .
తెగులు తీవ్రత ఎక్కువగా ఉండి పురుగులు కూడా ఉంటే మోనోక్రోటోఫాస్ (1.6 ml/లీటర్) వాడాలి.
ప్ర: మేడం, చిన్న మొక్కలపై మోనో క్రోటోఫాస్ లాంటి రసాయనిక మందులు స్ప్రే చేసినప్పుడే గాలిలో వ్యాపిస్తూ కాలుష్యానికి కారణ మవుతుంది కదా..? ఇంత పెద్ద చెట్లకు స్ప్రే చేయడం సాధ్యం కాక పోవడంతో పాటు వాతావారణం విషతుల్యం అవుతుంది కదా..?
ప్రొఫెసర్ మాలతి : నిజమే , పెద్ద చెట్లపై మందులు చల్లడం వల్ల వాతావరణ కాలుష్యం అయ్యే అవకాశం ఉంది . అదీ సాధ్యం కూడా కాక పోవచ్చు .. అందుకే రూట్ ఫీడింగ్ విదానం చేపట్టాలి. చెట్టు చుట్టూ ఒక అడుగు లోతులో మట్టి తీసి మందు ద్రావణాన్ని పోయాలి.
చెట్లు ఎండిపోతున్నాయని వాటిని నరికేయాల్సిన అవసరం లేదు. సరైన పోషణ, సేంద్రియ ఎరువులు ఇస్తే అవి మళ్ళీ చిగురించి కోలుకుంటాయి..
———————————–
