
* హైదరాబాద్ కోకాపేటలో ఘటన
ఆకేరున్యూస్, హైదరాబాద్ : కాలంతోపాటు మనుషుల ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి ఆలోచనను మరొకరితో పంచుకునే పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. మంచి చెడును విశ్లేషించుకునే స్థితిలో లేరు . గీతను దాటుతున్నారు. ఎవరి దారివారిదే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరికి అనుమానం, వేధింపులు, మద్యానికి బానిసలుగా మారుతున్నారు. బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలను మరుస్తూ కర్కశంగా మారుతున్నారు. ఎవరు ఎవరినీ ఎప్పడు, ఎలా అంతమొందిస్తారో తెలియని పరిస్థితి నేటి సమాజంలో నెలకొంది. క్షణికావేశంలో వారేమి చేస్తున్నారో గుర్తించలేని స్థితికి చేరుతున్నారు. ఈ లాంటి పరిస్థితుల్లో ఓ భార్య భర్త అంతమొందించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. …బతకుతెరువు కోసం కోసం దంపతులు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కొకాపేట్లో కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త భరత్ బోరా వేధింపులకు గురిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి చిన్న విషయానికి భార్యాభర్తలు వాగ్వాదానికి దిగారు. వేధింపులు తాళలేక విచక్షణ కోల్పోయిన భార్య భర్తపై కత్తితో దాడి చేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. భరత్ కేకలు విన్న స్థానికులు లోపలికి వచ్చి చూడగా భర్త రక్తపుమడుగులో పడి ఉన్నాడు. హుటాహుటిన భరత్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నార్సింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి, నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
…………………………………………………