* కాంగ్రెస్ జోరుగా ఆపరేషన్ ఆకర్ష్
* రేవంత్ టార్గెట్ 26 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు!
* అధిష్ఠానం అనుమతుల కోసమే తరచూ ఢిల్లీకి
* ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు
* తాజాగా మరో ఎమ్మెల్యేకు గ్రీన్ సిగ్నల్!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : ‘నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా..’ అన్న చందంగా గతంలో కేసీఆర్ అమలు చేసిన వ్యూహాన్నే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అనుసరిస్తున్నారు. ‘ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా’ అని చెప్పి మరీ బీఆర్ఎస్ (BRS) కు కనీసం ప్రతిపక్ష బలం కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర అంశాలతో పాటు చేరికలపై చర్చ, అనుమతి కోసమే తరచూ ఢిల్లీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతున్నట్లు తాజా రాజకీయ పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే తన నివాసంలో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ నుంచి ఇటు షిప్ట్ అయ్యారు. తాజాగా మరో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అప్పట్లో ఇలా..
గత ఎన్నికల ఫతితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చుట్టూ అప్పటి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తిరిగేవారు. నల్లగొండ నుంచి ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన హుజూర్నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో సభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య సాంకేతికంగా 18కి పడిపోయింది. ఇదే అదనుగా పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. శాసనసభాపక్షంగా మారి బీఆర్ఎస్ఎల్పీలో విలీనం అయ్యారు. మూడింట రెండొంతుల మంది చీలినందున ఇది రాజ్యాంగ విరుద్ధం కాదంటూ నాటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఆ విలీనానికి ఆమోద ముద్ర వేశారు.
అదే బాటలో రేవంత్
గత ఎన్నికల్లో కేసీఆర్ నడిచిన బాటలోనే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో మొదలై.. కాలె యాదయ్య, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా ఇప్పటిదాకా ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరో 15 మంది వరకూ తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై.. హితబోధ చేసినా ఫలితం ఉన్నట్లు కనిపించడం లేదు. రాత్రికి రాత్రే ఆరుగురు ఎమ్మెల్సీలు జారిపోయారు. ఇప్పుడు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతానంటూ అనుచరుల భేటీలో వెల్లడించారు. తాజాగా రేవంత్ రెడ్డితో గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య భేటీ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. అలాగే మరి కొంత మంది లోకల్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరిత అనుచరులు సెల్ టవర్ ఎక్కి పెట్రోల్ పోసుకుంటామంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయితే గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినా పార్టీలో సరితకు సముచిత స్థానం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
సీన్ రివర్స్
తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే పార్టీకి కనీసం 12 మంది సభ్యులు ఉండాలి. గతంలో కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 6కు పడిపోయింది. దాంతో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను, భట్టివిక్రమార్క.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను కోల్పోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు సభలో 38 మంది సభ్యులు ఉండగా.. 26 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి కాంగ్రెస్‌లో చేరితే.. సభలో ఆ పార్టీకి 12 మందే మిగులుతారు. ఆ సంఖ్యకు ఒక్కటి తగ్గినా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాతో పాటుగా కేసీఆర్‌కు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదానూ కోల్పోతారు. రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా, 26 మంది కాంగ్రెస్ లోనే చేరకుండా, కొందరు బీజేపీలో చేరినా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
——————————