* చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఘటన
* ఘటనపై సీఎం సీరియస్.. నిందితులపై కఠిన చర్యలు
ఆకేరు న్యూస్, అమరావతి : అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టి చితక్కొట్టారు. పక్కనే వాళ్ల అబ్బాయి ఏడేళ్ల బాలుడు చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. కుప్పం మండలం నారాయణపురానికి చెందిన మునికన్నప్ప దగ్గర అదే గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప తన భార్య, పిల్లలను గ్రామంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో భార్య శిరీష కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. అయితే సకాలంలో అప్పు చెల్లించలేదని మహిళ పట్ల మునికన్నప్ప, అతని కుటుంబసభ్యులు దారుణంగా వ్యవహరించారు. మహిళను చెట్టుకు కట్టేసి హింసించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఇది వెలుగులోకి రావడంతో పోలీసులు మునికన్నప్ప, అతడి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ తెలిపారు. మరోవైపు హోంమంత్రి అనిత (Home Minister Anitha) బాధితురాలితో వీడియో కాల్లో మాట్లాడారు. ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
