* వైఎస్ వివేకా హత్యకేసుపై కీలక చర్చ
* నిందితులపై చర్యలు తీసుకోవాలని వినతి
* సునీతకు అండగా ఉంటామన్న అనిత
ఆకేరు న్యూస్, అమరావతి : దివంగత నేత వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితను అమరావతిలో ఈరోజు కలిశారు. ఈసందర్భంగా వారి మధ్య కీలక చర్చ జరిగింది. వివేక హత్య కేసులో జరిగిన అన్యాయాన్నిఅనితకు వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని సునీత చెప్పారు. వివేకా హత్య కేసులో బాధ్యులకు శిక్ష పడేవిధంగా ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
* ఆ పోలీసులను వదిలిపెట్టేది లేదు : హోంమంత్రి
వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులను భయపెట్టి.. నిందితులకు అండగా నిలిచిన పోలీసులను వదిలి పెట్టేది లేదని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సునీతకు సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. తప్పు చేసిన పోలీసులను కూడా వదిలిపెట్టబోమని చెప్పారు. కచ్చితంగా దోషులకు శిక్ష పేడేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
———————————–