* పేదలకు ఇళ్ల నిర్మాణం అందులో భాగమే
* నెక్లెస్‌రోడ్ లో గద్దర్ స్మృతివనానికి ఎకరం కేటాయింపు
* గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3కోట్ల విరాళం
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజా యుద్ధనౌక అమరజీవి గద్దర్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇల్లు లేని పేదలకు ఐదు లక్షలతో ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గద్దర్ అన్న ఆశయం, ఆలోచన నుంచి వచ్చిందేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రజా యుద్ధనౌక అమరజీవి గద్దర్ మొదటి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. నెక్లెస్‌రోడ్ లో గద్దర్ స్మృతి వనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరం స్థలం కేటాయిస్తున్నామని ప్రకటించారు. గద్దర్ ఆలోచనలపై నిత్యం రీసర్చ్ జరపడానికి, ఆయన పేరిట రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టడానికి గద్దర్ ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేపట్టిన పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ అని నామకరణం చేసింది గద్దరే అని భట్టి తెలిపారు. చివరి దశలో అడవుల్లో ఉన్న జనాలను చూడాలని, వారిని కలవాలని ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా తనతో పాటుగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నడిచారని, పాటలతో ఉత్తేజపరిచారని వివరించారు. సకల సమస్యలకు పరిష్కారం భారత రాజ్యాంగం అని చాటి చెప్పిన గద్దర్ అన్న ఆశయాన్ని ప్రతి ఇంటికి తీసుకొని వెళ్లి రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మనం గద్దర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
స్త్రీ పక్షపాతి గద్దర్
గద్దర్ స్త్రీ పక్షపాతి అని, పురుష ఆధిక్య సమాజంలో వివక్షతకు గురవుతున్న స్త్రీల హక్కుల కోసం అనేక పాటలు రాసి పాడారని, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ అనే పాటను రాసి తన తల్లి పడిన కష్టాలను పాటగా వినిపించారని తెలిపారు. గద్దర్ లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారన్నారు. ఆయన మావోయిస్టు, రైటిస్టు, లెఫ్టిస్టు, సెంట్రిస్ట్ అందరికీ ప్రీతిపాత్రుడు అన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తికి రాష్ట్రం వచ్చిన తర్వాత సరైన గౌరవం స్థానం దక్కలేదని పదేళ్లు బాధపడ్డామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వంలో గద్దర్ కు సరైన గౌరవాన్ని, స్థానాన్ని ఇవ్వాలని అనుకున్నామని, కానీ వారు ఇప్పుడు లేరన్న బాధ మమ్మల్ని వెంటాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చింది ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. గోసి గొంగడి గజ్జలు తప్ప ఆస్తులు లేని గద్దర్ తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటలో ఉన్నందున, వర్ధంతి కార్యక్రమానికి రాలేకపోయారని, అంతకు ముందే తమతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.
————————————-