వనదేవతల సన్నిధిలో పోలీసుల సందడి..
ఆకేరు న్యూస్:
మేడారం: వన దేవతల సాక్షిగా మేడారం గడ్డపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తులతో కిక్కిరిసిపోయే సమ్మక్క-సారలమ్మ జాతరలో భద్రతను పర్యవేక్షించే పోలీసులు, కాసేపు తమ లాఠీలకు పని చెప్పకుండా.. భక్తులతో కలిసి చిందేశారు. నిరంతర విధులతో అలసిపోయిన పోలీసు సిబ్బంది, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా స్టెప్పులేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. జాతర ప్రాంగణంలో భక్తులు డప్పులు కొడుతూ వెళ్తుండగా, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు తమను తాము మర్చిపోయి ఉత్సాహంగా నృత్యం చేశారు.కేవలం పురుష పోలీసులే కాకుండా, మహిళా పోలీసులు కూడా తమదైన శైలిలో స్టెప్పులేసి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు.పోలీసుల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘మారుమోగి’ పోతున్నాయి. నెటిజన్లు “పోలీసులలో కూడా కళాకారులున్నారు” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం..సాధారణంగా జాతర అంటే క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి కఠినమైన విధులతో పోలీసులు ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే, ఇలా భక్తులతో మమేకమై వారి సంస్కృతిని గౌరవిస్తూ సరదాగా గడపడం ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. పోలీసుల ఈ తీరును చూసి భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
