Eye Emergency Care
* హైదరాబాద్‌లో ప్రత్యేక పైలట్ ప్రాజెక్టు
Eye Emergency Care| ఆకేరు న్యూస్, హైదరాబాద్: కంటి గాయాలకు సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 108 అంబులెన్స్ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల (LVPEI), ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ప్రాంగణంలో ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.
ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ కె. కృష్ణంరాజు, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్. రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీపావళి సందర్భంగా బాణసంచా వల్ల కంటి గాయాలు సంభవించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, తొలుత హైదరాబాద్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఫోన్ చేస్తే తక్షణ సేవలు
కంటికి గాయం అయిన వెంటనే బాధితులు 108 ఉచిత నంబర్‌కు ఫోన్ చేస్తే, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అంబులెన్స్‌తో ఘటనా స్థలానికి చేరుకుంటారు. బాధితులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి వైద్యం కోసం ప్రత్యేక కంటి ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. సకాలంలో చికిత్స అందించడం ద్వారా దృష్టి లోపాలను నివారించడం, శాశ్వత అంధత్వం ముప్పును తగ్గించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
కంటి గాయాలకు గురైన బాధితులు సరైన అవగాహన, రవాణా సౌకర్యాల కొరత కారణంగా ఆసుపత్రికి చేరుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ జాప్యం చికిత్స ఫలితాలపై ప్రభావం చూపుతోందని తెలిపారు.
ఈ సమస్యను అధిగమించేందుకు అంబులెన్స్ పారామెడికల్ సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్లు, వైద్య శిక్షకులకు ప్రత్యేక శిక్షణ అందించారు. కంటి గాయాలను గుర్తించడం, వాటి తీవ్రతను అంచనా వేయడం, ఆసుపత్రికి తరలించే ముందు అందించాల్సిన చికిత్సపై అవగాహన కల్పించారు.
అంబులెన్సుల్లో కంటి గాయాల అత్యవసర చికిత్స కిట్లను కూడా అందుబాటులో ఉంచారు. రసాయనాలు కంటిలో పడటం, బలమైన వస్తువులు తగలడం, పదునైన వస్తువులు గుచ్చుకోవడం, కంటిలో నలుసులు పడటం వంటి సందర్భాల్లో బాధితులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు ప్రామాణిక విధానాలను రూపొందించారు.
అంధత్వ నివారణకు ముందడుగు
యువతతో పాటు పనిచేసే వయసులో ఉన్నవారిలో నివారించగలిగే అంధత్వాన్ని తగ్గించేందుకు ఈ సేవలు కీలకంగా నిలుస్తాయని వైద్యులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు, చికిత్స ఫలితాలను విశ్లేషించేందుకు ప్రత్యేక డేటా సేకరణ, మూల్యాంకన వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కంటి గాయాల బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, అవసరమైన ఆసుపత్రులకు వేగంగా తరలించే విధానాన్ని బలోపేతం చేయడంలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది.
ప్రముఖుల భాగస్వామ్యం
ప్రారంభ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల తరఫున యూనివర్సల్ కార్నియా కేర్ మిషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ కే. వడ్డవల్లి, వైస్ చైర్ డాక్టర్ రాజీవ్ రెడ్డి పప్పురు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ ఎమెరిటస్ రామం ఆత్మకూరి పాల్గొన్నారు.
ఈఎంఆర్ఐ తరఫున సీనియర్ ప్రెసిడెంట్ సుబోధ్ సత్యవాది, ఎమర్జెన్సీ మెడిసిన్ లెర్నింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జి.వి. రమణారావు, కన్సల్టెంట్ డాక్టర్ రాజ నర్సింగ్ రావు హాజరయ్యారు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రి తరఫున ఆప్తాల్మాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతా మరిసా, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల కార్నియా స్పెషలిస్ట్ డాక్టర్ పూర్ణిమ తాండ్ర ఈ కార్యక్రమ రూపకల్పన, సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.
కంటి గాయాల సమయంలో బాధితులకు వేగంగా వైద్య సహాయం అందించి, చూపును కాపాడేందుకు ఈ ప్రత్యేక అంబులెన్స్ సేవలు దోహదపడనున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

