
కర్ణాటకలోని హవేరి జిల్లా రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
* రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
* ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ బస్సు
ఆకేరు న్యూస్ డెస్క్ : దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున బైడగి తాలుకాలోని గుండేనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ మినీ బస్సు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 13 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంలో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితులంతా శివమొగ్గ జిల్లా ఎమ్మిహట్టి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వారంతా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నదని చెప్పారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
———