* బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలపై అసెంబ్లీలో ఎండగట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడంపై కాంగ్రెస్‌పై కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలే గానీ, ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని నిలదీశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని.. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో సర్కార్ వైఖరిని ఎండగతామన్నారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీ ఏర్పాటు చేస్తామని.. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు.
………………………………..