Legal Awareness Camp Kamalapur School
* జడ్జి వెంకట హైమ పూజిత పిలుపు
* చట్టాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
ఆకేరు న్యూస్, కమలాపూర్ : విద్యార్థి దశలోనే నేరాలు, చట్టాలపై అవగాహన పెంచుకుంటేనే భవిష్యత్తులో నేరరహిత సమాజం సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకట హైమ పూజిత స్పష్టం చేశారు. బుధవారం కమలాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, డి.ఎల్.ఎస్.ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
* చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి..
విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జడ్జి సూచించారు. మార్కులు ఒక్కటే జీవితానికి కొలమానం కాదన్నారు. సదస్సులో భాగంగా 2012 పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరిస్తూ, చిన్నతనంలో చేసే పొరపాట్లు జీవితాన్నే నాశనం చేస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోక్సో కేసు నమోదైతే భవిష్యత్తు కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
* పోక్సో, సైబర్ నేరాలపై చైతన్య కార్యక్రమం..
నేటి కాలంలో పిల్లలపై పెరుగుతున్న అకృత్యాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 2,600 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారనే పోలీసు గణాంకాలను ప్రస్తావిస్తూ, అపరిచితుల మాయమాటలు నమ్మవద్దని విద్యార్థులకు హితవు పలికారు.
ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే న్యాయశాస్త్రం చదివి జడ్జి స్థాయికి చేరుకున్న తన జీవిత అనుభవాన్ని పంచుకుంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. తల్లిదండ్రుల ఆశయాలను నిలబెడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఏఎస్ఐ భాగ్యలక్ష్మి, పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రవీందర్, ఏటీపీ శ్రీ వాణి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

