Rayaparthy Konduru ZPHS Cash Awards
* విద్యార్థులకు పూస సతీష్-లక్ష్మి దంపతుల బాసట..
* వచ్చే ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి ఖర్చులు భరిస్తామని హామీ
ఆకేరు న్యూస్, రాయపర్తి : ”స్వగ్రామంలో అక్షరాల నూనె పోసి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు” అనే నినాదానికి నిలువెత్తు రూపంగా నిలిచారు రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన ప్రవాస (హైదరాబాద్) పారిశ్రామికవేత్త, దాత పూస సతీష్ కుమార్ – లక్ష్మి దంపతులు. కొండూరు గ్రామంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకుని, ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడిన సతీష్ కుమార్.. తాను పుట్టి పెరిగిన నేల రుణం తీర్చుకునే క్రమంలో ఏటా స్వగ్రామ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.
ఇందులో భాగంగానే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కొ కొణతం పద్మలత అధ్యక్షతన కొండూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అత్యంత వైభవంగా నగదు ప్రోత్సాహకాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. గతంలో విద్యార్థులకు డిక్షనరీలు, పరీక్షా సామగ్రిని అందజేసిన ఈ దంపతులు.. ఇచ్చిన మాట ప్రకారం 2025 మార్చిలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. పాఠశాలలో ప్రథమ స్థానం సాధించిన కర్ర గణేష్ (తండ్రి: ప్రవీణ్ రెడ్డి), ద్వితీయ స్థానం సాధించిన జున్ను శిరీష (తల్లి: రేణ)లకు ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఘనంగా అందజేశారు.
* అభినందనీయం.. అత్యున్నత ప్రకటన..
ఈ సందర్భంగా దాత పూస సతీష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఏ రంగంలోనూ వెనుకబడకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేదే తమ ఆశయమని తెలిపారు. అంతేకాకుండా, వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతిలో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించే విద్యార్థుల ఇంటర్మీడియట్ విద్యకు అయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించి అందరి హృదయాలను గెలుచుకున్నారు.
సభ అధ్యక్షురాలు, ప్రధానోపాధ్యాయురాలు కొణతం పద్మలత మాట్లాడుతూ.. సొంత ఊరును, ప్రభుత్వ పాఠశాలను మరచిపోకుండా దాతలు అందిస్తున్న సహకారం గ్రామీణ విద్యార్థులకు గొప్ప వరం అని కొనియాడారు. తోటి వారికి సహాయం చేయాలనే సతీష్ కుమార్ దంపతుల సేవాభావం మరెందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
* పాల్గొన్న గ్రామస్తులు, ఉపాధ్యాయులు..
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ అబేదా బేగం, సీనియర్ ఉపాధ్యాయులు వి.వి.ఆర్. ఆచార్య, రఘు, శ్యాంసుందర్, స్వామి, శివకృష్ణ, అమరస్వర్ణ, అనితారాణి, రాజు తదితర ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని దాతలను అభినందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

