AP CM High Level Review Arnab Cyclone
* భీకరగాలులు.. తీరం దాటిన తుఫాన్..
* ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించేలా చర్యలు చేప్టటాలని ఆదేశం
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీని వణికిస్తున్న అర్నబ్ తుఫాను తీరం దాటింది. యానాం – నర్సాపురం మధ్య తీరం దాటినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్ర తుపానుగా మారిన అర్నబ్ బలహీనపడి తుపానుగా మారింది. తీరం దాటిన సమయంలో 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు భయాందోళన కలిగించాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన వెల్లడించింది. తీరం దాటిన అనంతరం పలు జిల్లాల్లో అర్నబ్ విధ్వంసం సృష్టస్తోంది. భీకర గాలులు భయాందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరుగుతున్నాయి. ఏలూరులో 13 కెవి విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. భారీ స్తంభాలు రోడ్లకు అడ్డంగా పడ్డాయి. వాతావరణం ఆందోళన కలిగించేలా మారింది. అధికారులు రంగంలోకి దిగి రాకపోకలను సరిదిద్దుతున్నారు.
* సహాయక చర్యలపై సీఎం సమీక్ష..
అర్నబ్ తుఫాన్ ప్రభావం, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు మొత్తం 32,000 మంది అధికార యంత్రాంగంతో సీఎం బుధవారం తెల్లవారుజాము నుంచీ సమీక్షిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ తదితర శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తుగా చేపట్టిన అప్రమత్తత చర్యల వల్లే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం సంభవించలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
* రాత్రంతా కష్టపడి పని చేసి..
రాత్రంతా కష్టపడి పని చేసి ప్రజలకు అండగా నిలిచిన అధికారులు, సిబ్బందిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. తుఫాన్ ప్రభావం తగ్గి, బాధితులకు ఊరట లభించే వరకు ఇదే స్ఫూర్తితో నిరంతరం శ్రమించాలని, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని, జాతీయ రహదారులపై సమస్యలు ఉంటే రియల్ టైమ్లో పరిష్కరించాలని ఆదేశించారు. గాలుల తీవ్రత తగ్గిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, తుఫాన్ షెల్టర్లలో ఉన్న వారికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాల్లో ఎలాంటి లోటు లేకుండా చూడాలని పేర్కొన్నారు.
* ‘మనమిత్ర’ వ్యవస్థను ఉపయోగించండి..
క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ‘మనమిత్ర’ వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. పంట నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికలను తక్షణమే సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమగ్రంగా నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

