* స్థానిక ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఆకేరున్యూస్, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజా దర్బార్, గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి మూడు విడుతలుగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారని, కానీ ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారునికి కూడా న్యాయం జరుగలేదని విమర్శించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ప్రజలు ఆశలో ఉన్నారని చెప్పారు. వరంగల్‌లో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలం పాటు రైతు భరోసా ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదని మండిపడ్డారు. గ్రామ సభలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు పోయి నీతులు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. దావోస్ పెట్టుబడులు శుద్ధ అబద్ధమని, రేవంత్ రెడ్డి మాటలన్నీ బోగస్ అని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిమ్మిక్కులు చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. పోలీసులు, అధికారులను కార్యకర్తలుగా వాడుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా హామీలన్నీ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కరీంనగర్ కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. చిల్లర మాటలు మాట్లాడే కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో కాంగ్రెస్‌కు తెలుస్తుందన్నారు. భూతిక దాడులు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అబద్ధపు మాటలు, కుట్రలు, కుతంత్రాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నన్నపనేని నరేందర్ అన్నారు. కొండా సురేఖకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులకే మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామసభల్లో లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇస్తామన్న హామీలు ఒక్కటి కూడా నెరవేరడం లేదని చెప్పారు. వరంగల్‌లో ప్రజా పాలన కాదని, ప్రజా కంటక పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. పట్టణంలో కనీసం మంచినీటి సరఫరా కూడా సరిగ్గా చేయడం లేదంటూ మండిపడ్డారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
