Mulugu
Mulugu: ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కాశీందేవిపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల సమీపంలోని నీటికుంటలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. కాశీందేవిపేటకు చెందిన ఎండీ హమ్మద్ పాషా ఆదివారం సెలవు కావడంతో తన కుమార్తెలు సమ్రీన్ (18), ఆసియా (4)ను పొలం వద్దకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు కొంత దూరంలో వ్యవసాయ పనులు చేస్తుండగా.. చిన్న కుమార్తె ఆసియా కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది.
చెల్లెలు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన సమ్రీన్ ఆమెను కాపాడేందుకు కుంటలోకి దిగింది. అయితే కుంట లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. తల్లిదండ్రులు గమనించేలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పంచనామా నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి సీతక్క పరామర్శ
అక్కాచెల్లెళ్ల మృతిపై రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ.. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ఆస్పత్రిలో మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇద్దరు బాలికలు మృతి చెందడంతో కాశీందేవిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
