* భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: షెడ్యూల్ ప్రకారం జిల్లాలో పోషణ పక్వాడ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధులు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమాలు పోషణ పక్వాడ కార్యక్రమాల షెడ్యూల్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీ సిబ్బంది గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న చిన్నారుల పెరుగుదలను నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిర్దేశిత మాడ్యూల్ ప్రకారం పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించి గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించడానికి కృషి చేయాలని తెలిపారు. పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలని తెలిపారు. గర్భ నిర్ధారణ జరిగిన నాటి నుండి బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చేవరకు ప్రతి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. తీవ్ర, అతితీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డిపిఓ నారాయణ రావు, డిఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ, బిసి, ఎస్సి సంక్షేమ అధికారులు శైలజ, సునీత, డీఈఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండిరగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి..
ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండిరగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.శుక్రవారం ఐడిఓసి కార్యాలయం నుండి ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండిరగ్, ఉపాధిహామీ పధకం పనులకు లేబర్ మొబలైజేషన్, అమ్మ ఆదర్శ పాఠశాలల బిల్లులు చెల్లింపు, వృద్దాప్య పింఛన్లు, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలపై గృహనిర్మాణ శాఖ, డీఆర్డీఓ, డీఈఓ, మున్సిపల్ కమిషనర్ ఎంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండిరగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపిడిఓలను ఆదేశించారు. కాటారం డివిజన్ లో లబ్ధిదారుల విచారణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపికైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధిహామీ పథకం పనులకు పెద్దఎత్తున లేబర్ ను మొబలైజ్ చేయాలని తెలిపారు. మన జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో ఆశించిన ప్రగతి రావడం లేదని అన్నారు. మన జిల్లాలో కూలిరేటు సరాసరి 211 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. ప్రతి వారం ప్రగతి రావాలని సూచించారు. ఉపాధిహామీ పథకం పనులు వినియోగానికి ఈ రెండు నెలలు చాలా కీలకమని తెలిపారు. ఎక్కువ మందికి పనులు కల్పించడం ద్వారా నిధులు మంజూరుకు అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాసం గురించి మాట్లాడుతూ దరఖాస్తు చేయడానికి ఏ రోజులు సమయం మాత్రమే ఉన్నందున పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తగు ఏర్పాట్లు తో సిద్దంగా ఉండాలని తెలిపారు. ఆఫ్ లైన్ లో వచ్చిన దరఖాస్తులు ఎప్పటి కపుడు ఆయా కులాలు వారిగా రిజిస్టర్ లో నమోదులు చేయడంతో పాటు ఆన్లైన్ చేయాలని, రశీదు ఇవ్వాలని ఆదేశించారు. మున్సిపల్, ఎంపిడిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు తీసుకోవడం ఎంత ముఖ్యమో … నమోదు, రశీదు ఇవ్వడం అంతే ముక్యమని తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేయడానికి అవకాశం ఉన్నందున మండలస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు నమోదును పరిశీలన చేయాలని సూచించారు. సెర్ఫ్ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ వృద్దాప్య. పింఛను తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే అతని/ఆమె భార్యా లేదా భర్తకు పింఛను మంజూరుకు విచారణ నిర్వహించాలని తెలిపారు. వలస వెళ్లిన పింఛను దారులు, మూడు నెలల పాటు పింఛను తీసుకోని వారి జాబితా సేకరణ చేయాలని అన్నారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులకు నిధులు చెల్లింపు చేసేందుకు సోమవారం వరకు బిల్లులు అంద చేయాలని పీఆర్, గిరిజన, టీడబ్ల్యూ ఐడిసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
………………………………………
