Godavari water level reached 43 feet at Bhadrachalam, prompting the first flood warning.
ఆకేరు న్యూస్, భద్రాచలం:
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, నదుల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈరోజు (31-07-2026) ఉదయం 10:14 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరింది.
గోదావరి నీటిమట్టం 43 అడుగులు తాకడంతో అధికారులు అధికారికంగా మొదటి ప్రమాద హెచ్చరికను (First Warning) జారీ చేశారు. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రవాహ అంచనాలు (Forecast) స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భద్రాచలం సబ్‌కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సహా పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులందరినీ అప్రమత్తం చేశారు. గోదావరి ఫ్లడ్ మ్యాన్యువల్ నిబంధనల ప్రకారం (Godavari Flood Manual) వరద నివారణ విధుల్లో ఉన్న అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.
చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల తహసీల్దార్లు, ఎస్ఐలు, అన్ని కంట్రోల్ రూమ్‌లు, సెటోరియల్ అధికారులు నిరంతరం పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. నీటిమట్టం మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాలు మరియు లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవాహ ఉధృతి దృష్ట్యా ప్రజలు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
