* కాయల పక్వానికి నిషేధిత రసాయనాల వాడకం…
* కార్బయిడ్, ఇథిలిన్ విరివిగా వినియోగం
* మామిడి, అరటి వ్యాపారంలో ఆగని కెమికల్ దందా-
* ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారులు
* నామమాత్రపు తనిఖీలతోనే సరిపెడుతున్న అధికారులు…
ఆకేరున్యూస్, హైదరాబాద్: మారుతున్న ప్రస్తుత కాలంలో ప్రజలు భోజనంతో సమానంగా పండ్లను తినడం పై శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఇంత ఇష్టంగా తినే పండ్లు మాత్రం విషంతో సమానంగా మారుతున్నాయి. కృత్రిమ పద్ధతిలో రసాయనాలతో కాయలను మాగపెట్టడంతో వాటిని తింటున్న ప్రజలు అనారోగ్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. సహజ పద్ధతిన పండిన పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంత మంచి జరుగుతుందో ఈ కృత్రిమ పద్ధతి వల్ల మక్కించిన పండ్లతో అంతకు రెట్టింపు నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుచుండగా, దీనిని అదునుగా చేసుకుని పలువురు వ్యాపారులు కనీసం పక్వానికి కూడా రాని అరటి, మామిడి కాయలను కార్బయిడ్, ఇథిలిన్ కెమికల్స్ పక్వానికి పెట్టి పండ్లుగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లాల్లో ఫ్రూట్ మార్కెట్లు, పండ్ల గోదాంలలో నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలను వాడి పండ్లను మక్కపెట్టి మార్కెట్లలో విరివిగా విక్రయిస్తున్నను సంబంధిత ఫుడ్ కంట్రోల్, మున్సిపల్ అధికారులు మాత్రం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రసాయనాలతో పక్వానికి పండ్లు
ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సహజ సిద్ధంగా గడ్డిలో మమిడి పండ్లను మక్కించాల్సి ఉంటుంది. దీనికి వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉండడంతో వ్యాపారులు అత్యాశతో రెండు, మూడు రోజుల్లోనే రసాయణాలతో పండ్లు మక్కేల చేస్తున్నారు. అరటి, మామిడి తోటల నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న కాయలను గోదాంలకు తరలించి కెమికల్స్ రెండు, మూడు రోజుల్లోనే పండ్లుగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గతంలో కార్బయిడ్తో పండ్లను మక్కించడంపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఇథిలిన్తో మాగ పెడుతున్నారని సమాచారం. ఇది గమనించని ఫుట్పాత్ పై అమ్ముకొని జీవనం కొనసాగించేవారూ మారు బేరానికి వారి దగ్గర నుండి విక్రయించి అమ్ముతున్నారు. కేవలం పట్టణాలకు పరిమితమైన ఈ అమ్మకాలు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆటోలలో ట్రాలీ వాహనాలలో విక్రయిస్తున్నారు.
ఎంత మోతాదులో వాడాలి…
కార్బయిడ్, ఇథలిన్ ఎంత మెతాదులో వాడాలో తెలియని వ్యాపారులు, ఇష్టారీతిన వినియోగిస్తు మామిడి పండ్లతో పాటు అరటి, సపోట, పప్పాయి వంటి పండ్లను నానాబెట్టి మక్కిస్తున్నారు. దీంతో పండ్లు రెండు, మూడు రోజుల్లోనే మక్కి మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. బంగారు వర్ణంలో తాజాగా ఉన్నను అవి అత్యంత విషతుల్యమైనవని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రసాయణాలతో మక్కిన పండ్లు రోగ కారకాలే
రసాయణ పధార్థాలతో మాగబెట్టిన పండ్లు విషతుల్యంగా అవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కార్బయిడ్, ఇథలిన్ వంటి రసాయణాలతో మక్కించిన పండ్లను తినడం వల్ల అల్సర్, కాలేయం, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సహజ సిద్ధంగా మాగపెట్టిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి చేకూరుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
పూర్తిగా కరువైన అధికారుల పర్యవేక్షణ
సూర్యాపేట జిల్లా లో ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకున్నవారే కరువయ్యారు. ఆహార కల్తీ నియంత్రణ శాఖ, మున్సిపల్ అధికారుల వ్యవహరం నిమ్మకు నీరెత్తినట్లుగా మారడంతో కల్తీరాయుల్ల ఆగడాలు మితిమీరి పోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు వస్తే తప్ప దాడులు చేయడం లేదని, దాడి చేసిన సమయంలో కొన్ని శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపగా వచ్చిన రిపోర్టుల ఆధారంగా చర్యలు మాత్రం లేవని విమర్శలు గుప్పుమంటున్నాయి. కానీ కాయలను పక్వానికి తెచ్చే ముందే వ్యాపారులకు అవగాహన కల్పించి సహజ పద్ధతిలో మక్కపెట్టేలా చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైన సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు.
రసాయణాలతో మక్కిన పండ్లను గుర్తించడం ఎలా..
కార్బయిడ్, ఇథలిన్ మాగపెట్టిన పండ్లను గుర్తించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అరటి, మామిడి పండ్లపై ఆకుపచ్చని మచ్చలు ఉంటాయి. ఎక్కువ పసుపు వర్ణంలో ఉన్న ఈ పండ్లను తినే సమయంలో నోట్లో కొంచెం మంట, కడుపులో నొప్పి, గొంతు నొప్పి ఉంటుంది. ముఖ్యంగా ఈ పండ్లను తిన్న తర్వాత డయేరియా సమస్యకు గురైతే కార్బయిడ్ వాడినట్లు గుర్తించాలి. సహజ సిద్ధంగా మాగితే ఆకుపచ్చ మచ్చలు, పసుపు రంగు కనిపించి, కనిపించనట్లుగా ఉంటాయి. పండును కోసినప్పుడు లోపలి గుజ్జు ఎరుపు, పసుపు రంగు కలిసినట్లు ఉంటుంది. పండ్లలో రసం ఎక్కువగా ఉంటుంది. తొడిమే లోపలికి పోతోందని ఈ లక్షణాలతో పండ్లను కృత్రిమ పద్ధతిలో మక్కబెట్టారని గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
………………………………………………..
