* మండిపడ్డ దాస్యం వినయ్‌భాస్కర్
ఆకేరున్యూస్, హన్మకొండ: కాంగ్రెస్ పార్టీకి పెద్దలపై ప్రేమ కురిపిస్తూ, పేదలపై ప్రతాపం చూపుతోందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. హనుమకొండ చౌరస్తా వద్ద ఉన్న చిరువ్యాపారుల సముదాయాలను మున్సిపల్, పోలీస్ అధికారులు తొలగించిన నేపథ్యంలో వారిని ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు 15 ఏండ్లుగా రస్తాలో చిన్నచిన్న వ్యాపారాలు, కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. పోలీస్, మున్సిపల్ అధికారులు తమ పొట్ట కొట్టారని, వ్యాపార సముదాయాలను కూల్చారని వ్యాపారులు కన్నీటి పర్యంతమయ్యారు. కార్మికుల హక్కులను కాల రాస్తే ఊరుకోమని, కార్మికులకు అండగా ఉద్యమిస్తామన్నారు. చిరువ్యాపారుల జీవితాలతో చెలగాటాలొద్దని దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట నుంచి వరంగల్ రైల్వేస్టేషన్ వరకు ప్రధాన రహదారి వెంట ఉన్న చిరువ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేస్తున్నారని, వారి జీవితాలను చిధ్రం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ల బృందం బాధితులతో కలిసి మున్సిపల్ అధికారులకు సమస్యను పరిష్కరించి చిరువ్యాపారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పులి రజినీకాంత్, 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్‌కుమార్, 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి చందర్, చింతాకుల ప్రభాకర్, పేర్ల మనోహర్‌రావు, ఖలీల్ ఉన్నారు.
……………………………………
