CP N Swetha Operation Muskaan XII Warangal
ఆకేరు న్యూస్, హనుమకొండ:
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 314 మంది చిన్నారులను రక్షించినట్లు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ వెల్లడించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో బాల కార్మికులు, బడి మానేసిన చిన్నారులను గుర్తించి రక్షించారు.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 269 మంది బాలురు, 45 మంది బాలికలు రక్షించబడ్డారు. వీరిలో 226 మంది బాల కార్మికులు, 85 మంది బడి మానేసిన (డ్రాప్‌అవుట్) చిన్నారులు ఉన్నారు. రక్షించిన పిల్లలను వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీల (CWC) ముందు హాజరుపరిచి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అనంతరం అప్పగించినట్లు కమిషనర్ తెలిపారు.
ఈ ఆపరేషన్ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 9 సబ్ డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, కార్మిక శాఖ అధికారులు, అలాగే షేర్, స్కోప్, FMM SSS స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా పాల్గొన్నారు.
రక్షించిన చిన్నారుల్లో బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 130 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
నిబంధనలను ఉల్లంఘించి చిన్నారులతో పనులు చేయించిన యజమానులపై 55 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు, కార్మిక శాఖ ద్వారా 92 ఇన్స్పెక్షన్ రిపోర్టులు నమోదు చేయించామని తెలిపారు. అలాగే 118 మంది పిల్లల వివరాలను జనరల్ డైరీల్లో నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, “పిల్లలు బడిలో ఉండాలి.. పనిలో కాదు. బాల్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
