* మధ్యవర్తిత్వం వహిస్తున్న కేంద్రం
* ఇద్దరు సీఎంలను ఢిల్లీకి ఆహ్వానం
* రేపు ఇరువురి మధ్య చర్చలు
* ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ముదురుతున్నాయి. కొంత కాలంగా ఏపీ వైఖరిపై తెలంగాణ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారు అనవసర ఆరోపణలు, అనుమానాలతో మాట్లాడుతున్నారని ఏపీ నేతలు అంటున్నారు. ఈనేపథ్యంలో మాట్లాడి చర్చించుకుందామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సందర్భాల్లో ప్రకటనలు చేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంలో నడుస్తున్న ఈ వివాదానికి చెక్ పెట్టాలని కేంద్రం కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇద్దరు సీఎంలను ఢిల్లీకి ఆహ్వానించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీలో ఉండగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఇద్దరూ రేపు భేటీ కానున్నారు.
అసలు ఏంటీ వివాదం
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ నిబంధనలు ఉల్లంఘిస్తోందని తెలంగాణ అంటోండగా, అలాంటిది ఏదీ లేదని తెలంగాణ పేర్కొంటోంది. ఈ క్రమంలో సీఎంల భేటీ ఉత్కంఠగా మారింది. ఈ ప్రాజెక్టు విషయంలోనే కాదు,, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మరింత ముదిరింది. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నుంచి బొల్లపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు నీటిని తరలించి, రాయలసీమలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని, ఇతర ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఏపీ వాదన. అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ తమ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నీటి వాటాలను తగ్గిస్తుందని, రైతులకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం సముద్రంలోకి పోయే నీటినే తాము వినియోగిస్తున్నామని, ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు ఏ మాత్రం నష్టం జరగదని వాదిస్తున్నారు. తాజా పరిణామాలతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
కేంద్రం పెద్దన్న పాత్ర
కేంద్రం ఈ వివాదంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. గోదావరి, కృష్ణా నదులపై స్పష్టమైన నీటి కేటాయింపు నిర్ణయాలు, అపెక్స్ కౌన్సిల్ ద్వారా చర్చలు జరపడం ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం తెచ్చేందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. నీటి వనరుల వినియోగంలో రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలి. రాజకీయ లబ్ధి కంటే రైతులు, ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. చట్టబద్ధమైన, న్యాయమైన పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యానికి పరీక్షగా నిలుస్తోంది. దీనిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకుంటే నీటి వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇది గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యకు సానుకూల పరిష్కరాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. రేపు జరిగే తెలుగు రాష్ట్రాల సీఎం ల భేటీ తర్వాత నీటి వివాదాలకు చెక్ పడతాయో.. లేదో వేచి చూడాలి.
………………………………………
