ఆకేరు న్యూస్ , జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ ప్రధాన కార్యదర్శి దాసగాని సుధ డిమాండ్ చేశారు. మంగళవారం కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకునారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో తక్షణమే మధ్యాహ్న భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యాభ్యసించడానికి దూర ప్రాంతాల నుండి రావడం జరుగుతుందని, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వలన పొద్దున తినకుండా రావడం జరుగుతోందని, ఆహార పోషకాలు తగ్గడం జరుగుతోందని, దీని వలన విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, తక్షణమే భోజన సౌకర్యం కల్పించాలని అన్నారు. గత ప్రభుత్వం గాలి మాటలుగా హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ప్రభుత్వమైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే క్రమంలో యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తే భవిష్యత్తులో కచ్చితంగా ప్రభుత్వానికి గుణపాఠం విద్యార్థి లోకం ద్వారా చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించని ఎడల డిఐఈఓ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్య, జిల్లా నాయకులు రమేష్, రాజు, స్వాతి, సంధ్య, ఐశ్వర్య, తదితరులు పాల్గొన్నారు.
…………………………
