
* రామప్ప చెరువులో బోటింగ్పై పర్యాటకుల ఆసక్తి
* మరిన్ని పడవలు పెంచాలని డిమాండ్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః ఉమ్మడి వరంగల్ జిల్లా నేటి ములుగు జిల్లాలో ఉన్న రామప్ప చెరువుకు ప్రతీ రోజూ పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. వరంగల్ జిల్లా పేరు ఎత్తగానే ముందుగా గుర్తుకు వచ్చేది వేయిస్తంభాల గుడితో పాటు రామప్ప ఆలయం రామప్ప చెరువు…ఉమ్మడి రాష్ట్రం లోని అన్ని జిల్లాలనుంచి పర్యాటకులు రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి వస్తూనే ఉంటారు. 1213లో రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ రుద్రేశ్వరాలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులను ఆకర్శిస్తూనే ఉంది 2021 లో యెనెస్కో రామప్ప టెంపుల్ కు హెరిటేజ్ టెంపుల్ గా గుర్తింపునిచ్చింది. రామప్ప టెంపుల్ కు వచ్చిన వారు పక్కనే ఉన్న రామప్ప చెరువును సందర్శించక మానరు..
పర్యాటకులను ఆకట్టుకుంటున్న రామప్ప చెరువు
తెలంగాణలోని అతి ప్రాచీన చెరువుల్లో ఇది ఒకటి . ఈ చెరువును 13 వ శతాబ్దంలో కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ చెరువుకు ఓ వైపున ఎత్తైన కొండ ఉండడంతో ఈ చెరువు అందం మరింత పెరిగింది. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ చెరువు చూపరులను ఇట్టే ఆకర్శిస్తుంది..ప్రతీ రోజూ చెరువు పరిసరాలను ఆస్వాదిస్తూ వందల మంది టూరిస్టులు సేదతీరుతుంటారు. తెలంగాణలోనే ముఖ్యమైన పర్యటక ప్రాంతంగా ఉన్న ఈ చెరువుపై బోటింగ్ సదుపాయం కూడా ఉంది.
లాహిరి లాహిరి లాహిరిలో….
లాహిరి..లాహిరి..లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా.. టూగెనుగా అంటూ మయాబజార్ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావు , సావిత్రిలు బోటుపై షికారు చేస్తూంటారు. బోటింగ్ షికారులో ఉన్న ఆనందాన్ని వారు ఆస్వాదిస్తూ పాడుతుంటారు.. నిజంగా పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్ చేస్తే ఆ మజానే వేరేగా ఉంటుంది. వయసు తేడా లేకుండా బోటింగ్ అంటే ఇష్టపడుతుంటారు. రామప్ప చెరువులో కూడా బోటింగ్ సదుపాయం ఉంది, పర్యాటకులు వేల సంఖ్యలో బోటింగ్ చేస్తున్నారు.ప్రకృతి అందాల మధ్య బోటింగ్ చేస్తూ రామప్ప చెరువు పరిసరాలను ఆస్వాదిస్తున్నారు.
రెండు బోట్లు చాలడం లేదు
పర్యాటకుల సంఖ్యకు తగ్గట్టుగా బోట్లు లేకపోవడంతో బోటింగ్ చేయడానికి చాలా టైం పడుతోందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ కోసం పర్యాటకులు నిరీక్షిస్తున్నారు. ఎంకా ఎక్కువ బోట్లను సమకూర్చాలని కోరుతున్నారు.
ఆధునిక బోట్లను సమకూర్చాలి
ఆధునికంగా తయారు చేసిన బోట్లను సమకూర్చాలని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.
కశ్మీర్,,లాంటి ప్రదేశాల్లో ఎలాంటి పడవలను ఉపయోగిస్తారో అలాంటి పడవలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.ఇలా వెళ్లి అలా వచ్చే విదంగా కాకుండా చెరువు మధ్యలో కొన్ని గంటలపాటు ఉండే పడవలు ఉంటే బాగుంటుందని అంటున్నారు. పర్యాటకుల రద్దీకి తగ్గట్లుగా పడవలు సమకూర్చితే సమయం వృధా కాకుండా ఉంటుంది అంటున్నారు.
ఎంటర్టైన్ మెంట్ పెంచాలి
ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.. కానీ రామప్ప చెరువు వద్ద చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి పెద్దగా సదుపాయాలు లేవని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. చెరువు పరిసరాల్లో ఉద్యానవనాలను ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను సమకూర్చాలని కోరుతున్నారు.గేమింగ్ జోన్ లను ఏర్పాటు చేస్తే నిర్వాహకులకు ఉపాధి లభిస్తుంది. చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు అని రామప్పకు వచ్చిన పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తినుబండారాల కొరత
రామప్ప చెరువును చూడడానికి సుదూర ప్రాంతాలనుండి వస్తూంటారు. చెరువు పరిసరాల్లో తినుబండారాల దుకాణాల సంఖ్యను పెంచాలని పర్యాటకులు కోరుతున్నారు. స్నాక్స్ స్టాల్స్,టీ స్టాల్స్ కెఫెటీరియాలు మొదలైనవి స్టార్ట్ చేయాలని కోరుతున్నారు.
వసతి సౌకర్యాలు మెరుగుపర్చాలి
చెరువు పరిసరాల్లో ఒకటి రెండు రోజలు ఉండే విధంగా వసతి సౌకర్యాలను మెరుగు పరిస్తే
ఇంకా టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.సరైన వసతి సదుపాయాలు లేకపోవడంతో ఎక్కువ సమయం ఉండలేక పోతున్నామని టూరిస్టులు అభిప్రాయ పడుతున్నారు.
………………………………………………….