ఆకేరు న్యూస్, జనగామ: ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 46% భూముల్లోనే రైతులు పంట సాగు చేయడం గమనార్హం. 1.32 లక్షల ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా, కేవలం 61 లక్షల ఎకరాల్లోనే రైతులు పంట సాగు చేశారని వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ప్రధాన పంటలైన వరి విస్తీర్ణం 62.78 లక్షల ఎకరాలు కాగా కేవలం 7.78 లక్షల(12.46%) ఎకరాల్లో రైతులు సాగు చేయడం విశేషం. 48.93 లక్షల ఎకరాలు ఉండే పత్తి 38.57 లక్షల ఎకరాల్లో, 6.70 లక్షల ఎకరాలు ఉండే కంది 3.44 లక్షల ఎకరాల్లో, 5.21 లక్షల ఎకరాలు ఉండే మొక్కజొన్న 4.50 లక్షల ఎకరాల్లో, 4.20 లక్షల ఎకరాలు ఉండే సోయాబీన్ 3.31 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంట సాగు చేశారు. వీటితో పాటు పప్పుధాన్యాలు, నూనె గింజల పంట సాగు కూడా తగ్గిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఊహించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్లనే పంట సాగు విస్తీర్ణం భారీగా తగ్గిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.

…………………………………………
